icon icon icon
icon icon icon

నల్గొండ

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం (Nalgonda Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి జనరల్‌ కేటగిరిలో ఉంది.

Published : 08 May 2024 12:15 IST

లోక్‌సభ నియోజకవర్గం

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

2019 ఎన్నికల్ల కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం భాజపా నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రఘువీర్‌ కుందూరు, భారాస నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.

భారీ మెజారిటీ లక్ష్యంగా కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మిగిలిన పార్టీల కంటే ముందే కాంగ్రెస్‌ ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో.. ప్రచారంలోనూ ముందున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు కలిసికట్టుగా పాల్గొంటున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు కాంగ్రెస్‌వే. వాటిలో గత నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 2.87 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ లక్ష్యంగా నేతలు కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులుగా ఉన్న హుజూర్‌నగర్‌, నల్గొండ ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హుజూర్‌నగర్‌తో పాటు తన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనూ భారీ మెజారిటీ తేవాలనే పట్టుదలతో ఉత్తమ్‌ శ్రమిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు జానారెడ్డి సుపరిచితులు కావడం, నేతలందరితో ఆయనకున్న అనుబంధం.. రఘువీర్‌రెడ్డికి లాభించనుంది. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యం తేవాలనే తపనతో పనిచేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బలం ఉన్న వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి. 5 లక్షలకు పైగా మెజారిటీని ఆశిస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు.

చెమటోడుస్తున్న భారాస

భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి.. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి సోదరుడు. 2018 శాసనసభ ఎన్నికల నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో చేదు అనుభవాల నుంచి తేరుకొని లోక్‌సభ ఎన్నికల్లో ముందడుగు వేయాలనే లక్ష్యంతో భారాస పనిచేస్తోంది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ సెగ్మెంట్లలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ, నల్గొండలలో పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన సభలు విజయవంతం కావడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులు నియోజకవర్గంలో పలు దఫాలు పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణారెడ్డి కొత్త అభ్యర్థి అయినా.. నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, కుటుంబ సంబంధాలు తనకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు. సూర్యాపేటలో తమకు మెజారిటీ వస్తుందని, మిగిలిన ఆరు సెగ్మెంట్లలోనూ శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భారాస చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని నమ్మకంతో ఉంది. పలువురు నేతలు పార్టీ మారడం, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గం సహకరించకపోవడం భారాసకు కొంత ప్రతిబంధకంగా ఉంది.

మోదీపై సానుకూలతే భాజపా బలం

హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భాజపా అభ్యర్థిగా తలపడుతున్నారు. 2019లో జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలిచి, గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన అనూహ్యంగా భాజపాలో చేరి ఆ పార్టీ లోక్‌సభ టికెట్‌ తెచ్చుకున్నారు. సైదిరెడ్డికి మాజీ ఎమ్మెల్యేగా అనుభవం, గతంలో భారాసలో పనిచేసి ఉండడం అనుకూలతలుగా భాజపా భావించింది. అభ్యర్థిగా ప్రకటించాక.. మొదట్లో స్థానికంగా సైదిరెడ్డికి ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమయినా.. అధిష్ఠానం బుజ్జగింపులతో వారంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్‌తో పాటు ఇతర సెగ్మెంట్లలోనూ ఆదరణ లభిస్తుందని భాజపా నేతలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న సానుకూలతతో భాజపావైపు ఓటర్లు మొగ్గుచూపుతారని నమ్ముతున్నారు. నియోజకవర్గంలో భాజపాకు గతంలో చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోవడం, పార్టీకి పూర్తిస్థాయి క్యాడర్‌ లేకపోవడం ప్రతికూలాంశాలు.

  • గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు
  • 1952(ద్వి): ఆర్.నారాయణరెడ్డి పీడీఎఫ్ వి.బి.రావు(కాంగ్రెస్)
  • 1957: (ద్వి)డి.వెంకటేశ్వరరావు పీడీఎఫ్ జి.ఎన్.రెడ్డి(కాంగ్రెస్)
  • 1960: (ఉ.ఎ) ఎం.పెద్దయ్య(కాంగ్రెస్)
  • 1962: రావి నారాయణరెడ్డి(సీపీఐ)
  • 1967: ఎం.వై.సలీం (కాంగ్రెస్)
  • 1971: కె.రామకృష్ణారెడ్డి (టీపీఎస్)
  • 1977: ఎండీ.అబ్దుల్‌లతీఫ్ (కాంగ్రెస్)
  • 1980: టి.దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్-ఐ)
  • 1984: ఎం.రఘుమారెడ్డి (టీడీపీ)
  • 1989: చకిలం శ్రీనివాసరావు (కాంగ్రెస్)
  • 1991: బొమ్మగాని ధర్మబిక్షం (సీపీఐ)
  • 1996: బి.ధర్మబిక్షం (సీపీఐ)
  • 1998: సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ)
  • 1999: గుత్తాసుఖేందర్‌రెడ్డి (తెదేపా)
  • 2004: సురవరంసుధాకర్‌రెడ్డి (సీపీఐ)
  • 2009: జి.సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 2014: సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 2019: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img