icon icon icon
icon icon icon

PM Modi: ‘ఆ నోట్ల గుట్టలకు 70 ట్రక్కులు కావాలి’: ఈడీ సోదాలపై మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఈడీ సోదాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ గట్టిగా తిప్పికొట్టారు. ప్రజల సొమ్మును దోచుకునే ప్రయత్నాలకు తాను అడ్డుగోడలా నిలబడతానని అన్నారు.

Published : 13 May 2024 16:04 IST

ముజఫర్‌పుర్‌: విపక్ష ఇండియా కూటమి (Opposition INDIA bloc) నేతలు పిరికివారని, అందుకే పాకిస్థాన్‌ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎద్దేవా చేశారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఏడాదికో నేతకు పంచుతారని దుయ్యబట్టారు. బిహార్‌ (Bihar) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హజీపుర్‌, ముజఫర్‌పుర్‌, సరణ్‌లో వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ దాడుల (ED Raids)పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

‘‘ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా వారు (విపక్ష నేతలు) ఎందుకు గొంతు చించుకుంటున్నారో నేను చెప్తాను. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం ఓ స్కూల్‌ బ్యాగులో దాచిన రూ.35లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగింది. అదే మేం అధికారంలో వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు దాదాపు రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును బట్టబయలు చేసింది. ఆ నోట్ల గుట్టలను తరలించాలంటే కనీసం 70 చిన్న ట్రక్కులు కావాలి. రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఎన్డీఏకు 400 సీట్లు రాబోతున్నాయి: పీఎం మోదీ

భాజపాలో మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరు? అంటూ విపక్షాలు చేసిన విమర్శలపైనా ఆయన స్పందించారు. ‘‘పార్టీలో నాకు వారసులు లేరని అంటున్నారు. సామాన్య ప్రజలే నా వారసులు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌, ఆర్జేడీ వంటి పార్టీలు చెబుతున్నాయి. వారసత్వ పన్ను తీసుకురావాలని అంటున్నాయి. నేను బతికున్నంత వరకు అలా జరగనివ్వను. ప్రజల సొమ్మును దోచుకోవాలనుకునే వారి ప్రయత్నాలకు నేను అడ్డుగోడలా నిలబడతా’’ అని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రధాని తిప్పికొట్టారు. ‘‘పిరికివాళ్లతో నిండిన విపక్షం పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు క్లీన్‌ చిట్‌ ఇస్తున్న ఆ నేతలు.. మన ఆయుధ సంపత్తిని కూల్చివేయాలనుకుంటున్నారు. ఇండియా కూటమి ఓ ఫార్ములాపై పనిచేస్తోంది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఏడాదికో నేత ప్రధానిగా ఉంటారు. అప్పుడు దేశం ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్తుందో ఊహించండి. వారిదో విఫల కూటమి’’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img