icon icon icon
icon icon icon

హైదరాబాద్

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది (Hyderabad Lok Sabha constituency)  జనరల్‌ కేటగిరీలోనే ఉంది.

Published : 12 May 2024 19:23 IST

లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ నియోజకవర్గ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్‌, చంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో రెండే రెండు పార్టీలు విజయం సాధించడం గమనార్హం. ఏడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, 1984 నుంచి ఎంఐఎం గెలుపొందుతూ వస్తోంది.  హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్‌ పార్టీకి కంచుకోటలాంటింది. గత నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీలో నిలిచి, ఘన విజయాన్ని అందుకున్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. తాజాగా ఆయనే బరిలో నిలబడ్డారు. భాజపా నుంచి మాధవీలత, భారాస నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌ పోటీ చేస్తున్నారు.

మజ్లిస్‌.. మెజారిటీపై ధీమా

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సిటింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే ప్రచారం ప్రారంభించిన ఆయన.. నామినేషన్‌ అనంతరం విస్తృతం చేశారు. ఉదయం పాదయాత్ర, సాయంత్రం బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటున్నారు. పాతబస్తీ అంతా తమ మద్దతుదారులేనని, ఈసారి 3 లక్షల ఓట్ల మెజారిటీ సాధిస్తామని అసదుద్దీన్‌ అంటున్నారు. ఐదేళ్లలో పాతబస్తీలో అనేక అభివృద్ధి పనులు చేశానని చెబుతున్నారు. ఎంపీ లాడ్స్‌తోపాటు ఎంఐఎం ఎమ్మెల్యేల నిధులతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రహదారుల విస్తరణ చేపట్టామని, మెట్రోరైల్‌ పనులు చేపట్టాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని వివరిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఒకవైపు ప్రచారం నిర్వహిస్తుండగా.. మరోవైపు కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థుల పేర్లను ఆయన కనీసం ప్రస్తావించడం లేదు. అయితే నరేంద్ర మోదీ, అమిత్‌షాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుచోట్ల మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఉండటం పార్టీకి సానుకూలాంశంగా ఉంది. హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తొలిసారిగా తెలుగు పాటలను తెరపైకి తెచ్చారు. తెలుగులో కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ.. సోమ్‌నాథ్‌ దేవాలయం, వారణాసి ఆలయం చరిత్ర, హిందూ పాలకుల గురించి ప్రస్తావిస్తున్నారు.

భాజపా.. మజ్లిస్‌పై విమర్శలే ప్రచారాస్త్రాలు

మజ్లిస్‌కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరేయాలని భాజపా అగ్రనేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు 2014 నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేకపోయారు. రాజకీయాలకు కొత్త అయిన కొంపెల్ల మాధవీలతకు ఈసారి టికెట్‌ ఇచ్చారు. ఆమె రెండు దశాబ్దాలుగా పాతబస్తీలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని గల్లీల్లో ఇళ్లకు వెళ్లి చాయ్‌ ఇస్తారా, మజ్జిగ ఇస్తారా? అంటూ అడుగుతున్నారు. ఇంటి బయటే కూర్చుని టీ, మజ్జిగ తాగి కృతజ్ఞతలు చెబుతున్నారు. పాతబస్తీ వెనుకబాటుతనానికి మజ్లిస్‌ పార్టీయే ప్రధాన కారణమని ఆమె  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేరగాళ్లకు మజ్లిస్‌ నాయకులు అండగా ఉంటున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళలకు ఎంతో మేలు జరిగిందని చెబుతున్నారు. తనను గెలిపిస్తే పాతబస్తీలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ అగ్రనేత అమిత్‌షా స్వయంగా ప్రచారం చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నేతలూ ప్రచారం చేస్తున్నారు. అయితే చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో బలమైన క్యాడర్‌ ఉన్నా వారిలో కొందరు ఎన్నికల  ప్రచారంలో మొక్కుబడిగా పాల్గొంటుండటం ప్రతికూలాంశాలు.

కాంగ్రెస్‌.. గ్యారంటీలు, పాంచ్‌న్యాయ్‌తో ప్రజల్లోకి

నియోజకవర్గం పరిధిలోని యాకుత్‌పుర, బహదూర్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్‌కు మద్దతు ఇచ్చేవారి సంఖ్య తగ్గుతోందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. మలక్‌పేట, గోషామహల్‌ సెగ్మెంట్లలో భారాస నుంచి కీలక నాయకులు పార్టీలో చేరడం తమకు సానుకూలమని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. పాతబస్తీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, పార్టీ జాతీయ మ్యానిఫెస్టోలోని పాంచ్‌న్యాయ్‌లోని అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌కు కాంగ్రెస్‌ ఈ నియోజకవర్గ టికెట్‌ ఇచ్చింది. ఆయనకు పాతబస్తీలో పలువురు నాయకులతో పరిచయాలున్నాయి. కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పడు చార్మినార్‌, గోషామహల్‌, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించానని.. అది తనకు ఉపయోగపడుతుందని సమీర్‌ అంటున్నారు. ఆయనకు మద్దతుగా గోషామహల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, చార్మినార్‌, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించానని.. యువకులు, మహిళల ఆదరణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ప్రతికూలాంశంగా ఉంది.

భారాస.. అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ఆశలు

లోక్‌సభ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఓట్లు రాలుస్తాయని భారాస ఆశిస్తోంది. తొమ్మిదిన్నరేళ్లు పాతబస్తీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, మెట్రోరైలు ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ, మలక్‌పేట నియోజకవర్గంలో ఐటీ టవర్‌ నిర్మాణం, దళితబంధు, ముస్లింలకు రుణాల పంపిణీ, షాదీముబారక్‌ ప్రోత్సాహకాలు విజయం వైపు నడిపిస్తాయని పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. విద్యాసంస్థల అధినేత, పాతబస్తీ వాసి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌కు పార్టీ టికెట్‌ కేటాయించింది. యువజన కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి నేతగా పనిచేసిన శ్రీనివాస్‌యాదవ్‌ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారాసలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేయాలని ఆశించారు. టికెట్‌ రాకపోయినా పార్టీకి సేవలందిస్తుండడంతో లోక్‌సభ అభ్యర్థిగా పార్టీ అవకాశం లభించింది. పాతబస్తీలో భారాస నాయకుల సహకారం, తన విద్యాసంస్థలకు నగరంలో ఉన్న పేరుప్రతిష్ఠలు సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన నమ్ముతున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 చోట్ల భారాస అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పార్టీకి గణనీయంగా ఓట్లు వచ్చాయని.. ఈసారి మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నారు. అయితే ఒక్క స్థానంలోనూ భారాస గెలవకపోవడం ప్రతికూలాంశం. స్థానిక క్యాడర్‌ ప్రచారం నిర్వహిస్తున్నా అధినేత కేసీఆర్‌, అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇక్కడికి ప్రచారానికి రాలేదు. దీంతో స్థానిక నేతలు ఇంటింటి ప్రచారం, ర్యాలీలతో సరిపెడుతున్నారు.

  • గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే!
  • 1951: అహ్మద్ మొహిద్దీన్- కాంగ్రెస్
  • 1957: వినాయక్‌రావ్ కోరట్కర్- కాంగ్రెస్
  • 1962: గోపాలిష్ సుబ్బుకృష్ణ మేల్కొటే- కాంగ్రెస్
  • 1967: గోపాలిష్ సుబ్బుకృష్ణ మేల్కొటే- కాంగ్రెస్
  • 1971: గోపాలిష్ సుబ్బుకృష్ణ మేల్కొటే-కాంగ్రెస్
  • 1977: కేఎస్ నారయణ- కాంగ్రెస్
  • 1981: కేఎస్ నారాయణ- కాంగ్రెస్
  • 1984: సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 1989: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 1991: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 1996: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 1998: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 1999: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 2004: అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 2009: అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 2014: అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
  • 2019- అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img