icon icon icon
icon icon icon

భువనగిరి

Published : 03 May 2024 14:56 IST

నియోజకవర్గ సమాచారం

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో భువనగిరి (Bhongir Lok Sabha constituency) ఒకటి. 1962లో ఏర్పడ్డ మిర్యాలగూడ నియోజక వర్గం 2009లో రద్దయింది. 2009లో భువనగిరి పార్లమెంటు కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా రంగారెడ్డి, వరంగల్, నల్గొండ మూడు జిల్లాలకు చెందిన శాసనసభ నియోజకవర్గాలతో కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లానుంచి ఇబ్రహీంపట్నం, వరంగల్ జిల్లా నుంచి జనగామ శాసనసభ నియోజకవర్గంతో పాటు గతంలో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, భువనగిరి శాసనసభ నియోజకవర్గాలను ఇందులో కలిపారు.

2009లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండగా భాజపా నుంచి బూర నర్సయ్యగౌడ్‌, తెరాస నుంచి క్యామ మల్లేష్‌ బరిలో నిలిచారు.

బలమైన పోటీ ఇచ్చేలా.. భారాస

అధికారంలో కోల్పోవడంతో డీలా పడ్డ కార్యకర్తలను తిరిగి లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా భారాస ఎత్తుగడలు వేస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో భువనరిగి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్‌ను బరిలోకి దింపింది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి, స్వయంగా ప్రచారం చేసే అవకాశం ఉంది.  క్యామ మల్లేష్‌ కూడా నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంటుల్లో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

సిట్టింగులను నిలబెట్టుకునేలా..కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ నుంచి భువనగిరి స్థానానికి సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. భువనగిరిలో అభ్యర్థి ఎంపికలో కొంత జాప్యం జరిగినా, ప్రచారం విషయంలో మాత్రం దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించి, కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్త పరుస్తున్నారు.

కేంద్ర పథకాలు, మోదీ ప్రభతో..భాజపా

భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను భాజపా బరిలోకి దింపడంతో ఆయన పది రోజుల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ఉండటం, ఒక దఫా ఎంపీగా గెలుపొందడంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఓట్లు అడుగుతున్నారు.

  • గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు
  • 2009- కె.రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 2014- బూర నర్సయ్యగౌడ్‌(తెరాస)
  • 2019 కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img