logo

YVU: రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని ఆందోళన

విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో యోగి వేమన, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి, రిజిస్ట్రార్‌ వంటి కీలక పదవుల్లో నియమితులైన వారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated : 29 Jun 2024 07:47 IST

ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిన చింతా సుధాకర్‌

యోగి వేమన విశ్వవిద్యాలయం

న్యూస్‌టుడే, వైవీయూ(కడప): విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో యోగి వేమన, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి, రిజిస్ట్రార్‌ వంటి కీలక పదవుల్లో నియమితులైన వారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకూ వైకాపా నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విద్యానిపుణులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి అధికారులు తప్పుకొంటున్న నేపథ్యంలో పైరెండు విశ్వవిద్యాలయాలపై అందరి దృష్టిపెడింది. వైకాపా ప్రభుత్వం అక్రమాలకు నిలయంగా మారిన విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజీనామా చేయకుండా...

వీసీ సుధాకర్‌

యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ తానుంటున్న ఇంటిని ఖాళీ చేసి సొంతూరు అనంతపురానికి వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. కారు కూడా సంబంధిత వర్గాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీసీ రాజీనామా చేయకుండా వెళితే కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు ఆచార్యులు, అధ్యాపకులు చెబుతున్నారు. రిజిస్ట్రార్‌ వైపీ వెంకటసుబ్బయ్య కూడా తన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అధికార కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.

ఇంకా రెండేళ్లు ఉండగానే.. : ప్రస్తుత వీసీ చింతా సుధాకర్‌ను గత ప్రభుత్వం గతేడాది మే 11న నియమించింది. అంతకుముందు ఆయన అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీ ఆచార్యునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఈయన మాజీ సీఎం జగన్‌ సమీప బంధువు, ఆర్కిటెక్చర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డికి గురువు. ఆయన అండదండలతోనే వీసీగా నియమితులయ్యారు.

ఆర్థిక బిల్లులకు ఇబ్బందే

వైవీయూ అధికారులు రాజీనామా చేయకుండా, విధులకు దూరంగా ఉండటంతో ప్రస్తుత బోధన, బోధనేతర సిబ్బంది జీతాలకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆర్థిక బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటివరకు వేతనాలకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేయలేదు. మరోవైపు రూసా ప్రాజెక్టులు ఈ నెల 30వ తేదీలోపు సమర్పించాలి. వీటికి సంబంధించి దాదాపు రూ.4 కోట్లు నిధులు రావాల్సి ఉంది. దీనికితోడు పీజీ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రిన్సిపల్‌ కూడా ఆన్‌డ్యూటీ మీద వెళ్లిపోయారు.

ఇటీవల రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్యను నిలదీస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

తీవ్ర ఆరోపణలు : గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అధికారుల నిర్ణయాలు వైవీయూ, ఏఎఫ్‌యూలకు శాపంగా మారాయి. దీనికితోడు ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం, అక్రమ నియామకాలతో విద్యా ప్రమాణాలను పూర్తిగా దిగజారాయి. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో వీసీ, రిజిస్ట్రార్‌లు పదవి నుంచి దిగిపోవాలంటూ ఇటీవల వారి ఛాంబర్లను ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం కొన్ని రోజులు ఇంటికే పరిమితమైన వీసీ తాజాగా ఖాళీ చేసి సొంతూరు వెళ్లిపోయారు. వీరి రాజీనామాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని