logo

కాలువపై కన్నేశారు.. దర్జాగా కాజేశారు!

ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు.

Published : 05 Jul 2024 03:15 IST

వైకాపా నేతల కబ్జాతో బీడుగా మారిన 820 ఎకరాలు
ఎన్డీయే ప్రభుత్వం చర్యలతో వెలుగులోకి అక్రమాలు
 ఈనాడు, కడప

సుంకేసుల కాలువలో జరుగుతున్న పూడికతీత పనులు

ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు. దీని వెనుక ఆయన స్వార్థం ఉందని క్షేత్రస్థాయిలో ఆయన చేస్తున్న ఆక్రమణలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఖాజీపేటలో సుంకేసుల కాలువను చెరబట్టి దానిపై ఏకంగా దుకాణాలు నిర్మించేశారు. వాటిని బాడుగకు ఇచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ రైతుల నోట్లో మట్టి కొట్టారు. తన అనుచరులతో వందలాది ఎకరాలను బీడు భూములుగా మార్చి పాపం మూటగట్టుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కారు చొరవతో సదరు నేత అక్రమాలు, ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి.
మండల కేంద్రమైన ఖాజీపేట మీదుగా వక్కిలేరు నుంచి సుంకేసులకు వెళ్లే పంట కాలువను సదరు వైకాపా నేత ఆక్రమించుకున్నారు. కాలువ ఆనవాళ్లే లేకుండా చేసి ఏకంగా దుకాణ సముదాయాన్నే  నిర్మించారు. దీంతో సుంకేసుల, బీచువారిపల్లె ప్రాంతంలో సాగులో ఉన్న సుమారు 820 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి లేకుండాపోయింది. పంట కాలువ ఆక్రమణలపై ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. అధికారుల నుంచి స్పందన లేకపోవడం, ఆక్రమణదారులను ప్రశ్నించే ధైర్యం లేకపోవడంతో రైతులు భూములను బీడుగా వదిలేశారు.

ఆక్రమణలతో పూడుకుపోయిన సుంకేసుల కాలువకు నీరందించే ఆనకట్ట

  • ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. పంట కాలువ ఆక్రమణలపై ఇటీవల కడపలో జలవనరులశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఖాజీపేటలో పంట కాలువ ఆక్రమణలు తొలగించి రైతులకు సాగునీరిందించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు రెవెన్యూశాఖ అధికారుల సాయంతో సర్వే చేపట్టి ఆక్రమణలు తొలగించడంతోపాటు కాలువ మరమ్మతు పనులు శరవేగంగా చేపడుతున్నారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు తాగు, సాగు నీరిందించేవిధంగా చర్యలు చేపడుతున్నారు. గత వారం రోజులుగా యంత్రాలతో ఆక్రమణలు తొలగిస్తున్నారు.

కాలువను ఆక్రమించి నిర్మించిన కట్టడాలు

  • కాలువ ద్వారా సాగునీరు వెళ్లేందుకు వీలుగా నిర్మించిన చిన్నపాటి చెక్‌డ్యాంకు ఇరువైపులా పూడిక తీసి మట్టికట్టలు వేస్తున్నారు. కాలువ పునరుద్ధరణ విషయంలో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సైతం పట్టుదలగా ఉన్నారు. ఈయనను ఆక్రమణదారులు కలిసే ప్రయత్నం చేయగా తిరస్కరించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మంచి పని చేస్తున్నారని, ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేనని తేల్చి చెప్పారు. తాజాగా జరుగుతున్న పనులతో మండల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా రైతుల కోసం తాను పాటుపడతాననే హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ సీˆ్వకారం చేసి నియోజకవర్గంలో అడుగుపెట్టడంతోనే ఖాజీపేట మండలంలోని సుంకేసుల రైతుల కలను సాకారం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని