logo

అభివృద్ధికి అడ్డుపడం... అక్రమాలు సహించం...!

కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి.

Published : 05 Jul 2024 03:12 IST

 ర్యాటిఫికేషన్‌ పనులపై తెదేపా ఎమ్మెల్యేల తీవ్ర అసహనం
వాడివేడిగా కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 
న్యూస్‌టుడే, కడప నగరపాలక

వేదికపై ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, డిప్యూటీ మేయర్‌
ముంతాజ్‌బేగం, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి,  కమిషనర్‌ సూర్యసాయిప్రవీణ్‌చంద్‌

కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి. నగరపాలక సంస్థ క్రీడామైదానంలో అంతర్జాతీయ స్ధాయి హాకీ మైదానం నిర్మాణం, స్కేటింగ్‌ రింగ్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని భావించిన అధికారుల ఉద్దేశాన్ని అర్ధం చేసుకోగలం. కడప నగరాభివృద్ధికి చేపట్టిన ఏ ఒక్క పనికీ మేం అడ్డుపడం. అభివృద్ధి పనుల పేరిట అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు చేస్తే ఉపేక్షించం. ప్రతి అభియోగంపైనా విచారణ చేయిస్తాం. అజెండాలో చేర్చిన 4, 13, 14, 15 అంశాలపై వివరాలు అందించిన తరువాతే చర్చకు పెట్టాలి 

రెడ్డప్పగారి మాధవి, ఎమ్మెల్యే, కడప

2005 నుంచి ఏకపక్షంగా సాగుతున్న కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాల పరంపరకు తెరపడింది. కడపలో గురువారం డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌బేగం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తొలిసారిగా తెదేపా కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి హాజరైన నేపథ్యంలో వారికి వైకాపా కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు. కడప నగరంలో చనిపోయినవారిని ఖననం చేయడానికి తగిన శ్మశానాలు లేకుండా చేశారని నగరపాలకసంస్ధ పాలకవర్గాన్ని మాధవిరెడ్డి విమర్శించారు. 2014-19లో తెదేపా ప్రభుత్వం శ్మశానాలకు కేటాయించిన స్ధలాలను వైకాపా నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మాజీ ఉపముఖ్యమంత్రి ఇంటి ముందున్న కాలువలనే శుభ్రం చేయించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

  • ‘అత్యవసరమైతే రూ.10 లక్షల వరకు స్వీయవిచక్షణతో ఖర్చు చేసి ఆ నిర్ణయానికి స్ధానిక ప్రజాప్రతినిధుల నుంచి ర్యాటిఫికేషన్‌ తీసుకోవచ్చు. కడప నగరపాలక సంస్ధలో రూ.కోట్ల విలువైన పనులను చేయించిన అనంతరం కార్పొరేటర్ల ర్యాటిఫికేషన్‌ కోరడంలో ఔచిత్యం ఏమిటి? మేయర్‌ అన్నీ చేసిన తరువాతే బిల్లుల చెల్లింపునకు ఎస్‌ అనిపించుకోవడానికి మాత్రమే సమావేశాన్ని వాడుకుంటున్నారు. అలాంటప్పుడు కార్పొరేటర్ల అవసరం ఏముంది? నగరంలో అన్ని కూడళ్లు అభివృద్ది చేశారు. ఒక్క అప్సరా కూడలిని మాత్రం ఎందుకు వదిలిపెట్టారు ?’ ఎమ్మెల్యే మాధవిరెడ్డి  విమర్శించారు.
  • ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీకి తమకు ఆహ్వానం అందలేదని 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమాదేవి ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఏ ఒక్క కార్పొరేటర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపలేదని, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే స్వచ్ఛందంగా రావచ్చునన్నారు. అలంఖాన్‌పల్లిని మీరేమైనా రాయించుకున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు మహిళా కార్పొరేటర్ల భర్తలను కార్యాలయంలోకి అనుమతించలేదని 10వ డివిజన్‌ కార్పొరేటర్‌ మల్లి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేటర్ల భర్తలకు ప్రత్యేక హోదాలేమీ ఉండవని, వారిని అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా సమావేశానికి వస్తారని, వారిని అనుమతిస్తారా అని మాధవిరెడ్డి ఎదురు ప్రశ్నించారు.
  • 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆరీఫుల్లా హుస్సేనీ మాట్లాడుతూ నకాశ్‌లోని శ్మశానవాటికలో మోకాళ్ల లోతు నీరు చేరుతుండటంతో అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలస్వామిరెడ్డి మాట్లాడుతూ ఎస్బీఐ కాలనీలో కాలువల నిర్మాణ అస్తవ్యస్తంగా చేపట్టడంతో ప్రజలు మురుగుతో అవస్థలు పడుతున్నారన్నారు. పాత స్కేటింగ్‌ రింగు తొలగింపునకు రూ.22 లక్షలు ఎలా ఖర్చు చేశారని 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ సూర్యనారాయణరావు ప్రశ్నించారు. 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ రామలక్ష్మణరెడ్డి తమ వీధుల్లోని కాలువలను ప్రధాన కాలువలతో అనుసంధానించడంలో ప్రమాణాలు పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ షఫీ మాట్లాడుతూ రహదారుల విస్తరణకు సహకరించినవారికి నిర్మాణాల విషయంలో సహకరించడంలేదని నోటీసులిస్తున్నారన్నారు. 49వ డివిజన్‌లో తాగునీటి సమస్యపై కార్పొరేటర్‌ ఉమాదేవి మాట్లాడారు.
  •  సమావేశం ముగింపులో మరో డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి మేయర్‌ స్థానంలో అధ్యక్షత వహించారు. సమావేశ మందిరంలోకి ఇతరులు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరించినా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూర్చోవడం గమనార్హం. సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్, అధికారులు పాల్గొన్నారు.

కడప నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరాం..నేను, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలిసి నగరానికి కొత్త రూపురేఖలు తీసుకొస్తాం. చెన్నూరు, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలోని డివిజన్ల అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలి. ఎస్‌ఆర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకుండా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. లేఅవుÆట్లకు అనుమతి లేదని ఇళ్లపై రెట్టింపు పన్నులు విధిస్తున్నారు. ఇందిరానగర్‌లో నిర్మాణమైన తాగునీటి ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నారు.

 పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని