logo

మంగంపేట గనులపై విచారణ చేపట్టాలి

ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట గనుల్లో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నిధుల స్వాహాతోపాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి లేఖ రాశారు.

Published : 05 Jul 2024 03:02 IST

విజిలెన్స్‌ డీజీకి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి లేఖ

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట గనుల్లో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నిధుల స్వాహాతోపాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి లేఖ రాశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ముఖ్యంగా మాజీ ఎండీ వెంకట్‌రెడ్డి, ప్లానింగ్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌రెడ్డి ఇతర అధికారులు, ఖనిజ ఎగుమతి కంపెనీలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కంపెనీలకు లాభాలు చేకూర్చే క్రమంలో కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లేవిధంగా సంబంధిత అధికారులు, వైకాపా నేతలు ఇతర కంపెనీలతో కుమ్మక్కయ్యారన్నారు. వీరందరూ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని, ఇందులో భాగంగానే మినరల్‌ ఆర్డర్‌లు, సంబంధిత ఒప్పందాల్లో వ్యత్యాసాలు, అంగీకరించిన పరిమాణాల కంటే ఎక్కువ మోతాదులో కంపెనీలకు లాభాలు చేకూర్చారన్నారు. దీంతో పాటు ఏ గ్రేడ్‌ ఖనిజాలను సీ గ్రేడ్‌ ఖనిజాలని సూచించడంతో కంపెనీలకు లాభాలు చేకూర్చారని ఆరోపించారు. భారీగా అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని లేఖలో ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని