logo

మారని పంథా... ఆగని దందా!

జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు.

Updated : 05 Jul 2024 04:58 IST

పోలీసుల అండతో వైకాపా నాయకుల ఆగడాలు
రైల్వేకోడూరు, తంబళ్లపల్లెలో దారికి రాని పరిస్థితి

జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు. రైల్వే కోడూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఆగడాలు, ఆరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉండడం గమనార్హం. 

ఈనాడు, కడప

తన సొంత పొలంలో నిలబడి ఉన్న ఈమె పేరు అరుణ. ఈమెకు తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లె సమీపంలో 79 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీనిపై వైకాపా నేత, సింగిల్‌ విండో మాజీ ఛైర్మన్‌ అమరనాథ్‌ కన్నుపడింది. ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఈయన అరుణ పొలాన్ని కొట్టేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. పంట సాగు చేస్తే ట్రాక్టరుతో దున్నేయడం, ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగడం వంటివాటికి పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వైకాపా నేతకే వత్తాసు పలుకుతున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన సీఐ సూర్యనారాయణ నిందితులకే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. బాధితురాలు తెదేపా సానుభూతిపరురాలే కాకుండా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారనే అక్కసుతో నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. వైకాపా నేత అమరనాథ్, వారి అనుచరుల దౌర్జన్యాలు, పోలీసుల నుంచి న్యాయం జరగకపోవడంతో ఇటీవల ఆమె మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని సైతం కలిసి ఆవేదన వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సీఐతో మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించినా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. వైకాపా నేత, ఆయన అనుచరులకు అరుణ పొలానికి పక్కనే భూములుండడంతో రహదారి ఏర్పాటుకు భూమి వదలాలని కోరగా తిరస్కరించడంతో ఏకంగా పొలాన్నే ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలోని నేతలు మండలంలో భారీగా దందాలకు పాల్పడడంతో పాటు ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి జనసేన పార్టీలో చేరే ఎత్తులు వేస్తుండగా, ఆ పార్టీ నేతలు నిరాకరించారు.

చిత్రంలో కనిపిస్తోంది రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతసముద్రంలోని నీటి కుంట. దీనిని గ్రామానికి చెందిన వైకాపా కీలక నేత ఆక్రమించుకున్నారు. సర్వే సంఖ్య 137లో 11.73 ఎకరాల్లో కుంట ఉండగా, ఇందులో ఆరెకరాల వరకు ఆక్రమించుకుని ఇనుప కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. కుంటకు అనుబంధంగా సర్వే సంఖ్య 154లో 0.98 ఎకరాలు, 156లో 1.44 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఇక్కడ ఎకరా రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇలా దాదాపు రూ.కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించగా స్థానికులు రెవెన్యూశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. సర్వేతో సరిపెట్టి ప్రభుత్వ భూమిగా తేల్చారు. అయితే స్వాధీనం చేసుకోవడానికి వైకాపాతో అంటకాగుతున్న అధికారులు ముందుకు రావడంలేదు. ఇదే నేత పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా ప్రకృతి సంపదను కొల్లకొడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని