logo

హంద్రీనీవా కాలువకు మహర్దశ!

గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది.

Published : 05 Jul 2024 02:58 IST

రూ.380 కోట్లతో పనులు చేసేందుకు చర్యలు
ఎన్డీయే ప్రభుత్వం దృష్టిసారించడంతో కదలిక
 న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం, తంబళ్లపల్లె

మట్టితో తాత్కాలికంగా ఎత్తు చేసిన అంగళ్లు సమీపంలో హంద్రీనీవా కాలువ (పాత చిత్రం)

గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది. వైకాపా ప్రభుత్వం కనీనం కాలువ నిర్వహణ పనులు చేయించలేకపోయింది. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు కాలువను పరిశీలించి ఎస్‌ఈ రాజగోపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకుని అసంపూర్తి పనులపై దృష్టిసారించాలని ఆదేశించారు.

కొత్తపల్లె వద్ద హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువపై రైతులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన (పాత చిత్రం)

  •  పుంగనూరు ఉప కాలువ అనంతపురం జిల్లా ముదిగుబ్బ సమీపంలో బొంతలపల్లె వద్ద ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి జిల్లాలోకి పీటీఎం మండలం వద్ద ప్రవేశిస్తుంది. ములకలచెరువు, పీటీఎం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లె మీదుగా చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరు, వి.కోట, శాంతిపురం, కుప్పం వరకు వెళుతుంది. బి.కొత్తకోట నుంచి మదనపల్లె వరకు కృష్ణాజలాల పారుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాలువకు 25 చోట్ల గండ్లు పడడంతోపాటు పలుచోట్ల లీకేజీలేర్పడ్డాయి. దీంతో నీరు వృథా అవుతుండడంతో అధికారులు గట్టుపై మట్టిని పోసి తాత్కాలిక చర్యలు చేపట్టారు.
  • బి.కొత్తకోట నుంచి మదనపల్లె మధ్య 64 కిలోమీటరు నుంచి 83 కిలోమీటరు వరకు ఉన్న పెండింగ్‌ పనులతో పాటు కాలువ వెడల్పు, లీకేజీలున్నచోట్ల లైనింగ్‌ పనులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇందుకోసం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు రూ.280 కోట్లు ఖర్చు చేయనున్నాను. కాలువ వెడల్పు చేసేందుకు గతంలో నిర్వహించిన రూ.1,200 కోట్ల టెండర్లలోనే నిధులు వినియోగించి పనులు చేయడానికి ప్రభుత్వం అంగీకిరించినట్లు సమాచారం. గతంలో టెండరు ద్వారా పనులు దక్కించుకున్న గుత్తేదారుతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాన కాలువ గాలివీడు మండలం మడుగు వారిపల్లె 483 కిలోమీటరు నుంచి ప్రారంభమై కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. అసంపూర్తిగా ఉన్న ప్రధాన కాలువ పనులకు రూ.100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ప్రధాన కాలువలో మొత్తం 9 నిర్మాణాలుండగా, వీటిలో 3 నిర్మాణ దశలోనే నిలిచిపోగా, మిగిలినవి నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది.

అక్టోబరు నాటికి నీటిని తీసుకురావాలన్నది లక్ష్యం

త్వరితగతిన అసంపూర్తి పనులతోపాటు  కాలువ వెడల్పు, లైనింగ్‌ పనులు పూర్తి చేసి అక్టోబరు నాటికి కృష్జాజలాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టు కున్నాం. దీనిపై ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం.

 సి.ఆర్‌.రాజగోపాల్, ఎస్‌ఈ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని