logo

పరిహారం... పరిహాసం!

జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు.

Published : 05 Jul 2024 02:56 IST

ఏళ్లుగా మండిపల్లి నాగిరెడ్డి జలాశయ నిర్వాసితుల నిరీక్షణ

నిర్వాసిత కాలనీలో నిలిచిపోయిన పాఠశాల, తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు

జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు.  ఏళ్లుగా పరిహారం అందక ఆర్థికంగా చితికిపోయారు. వీరు పడుతున్న కష్టాలను ప్రతి ఎన్నికల వేళ కళ్లారా చూస్తున్న నేతలు హామీలిస్తున్నారే తప్ప ఆదుకోవడంలేదు. ఇదీ మండిపల్లి నాగిరెడ్డి జలాశయం నిర్వాసితుల దుస్థితి.

 న్యూస్‌టుడే, రాయచోటి, చిన్నమండెం

రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం మల్లూరు వద్ద 2005-2008 మధ్య కాలంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.320 కోట్లతో మండిపల్లి నాగిరెడ్డి జలాశయం నిర్మించింది. మెరుగైన పరిహారమిచ్చి ఆదుకుంటామని నేతలు, అధికారులు ముంపు గ్రామాలైన బండకాడకురవపల్లి, కొత్తవట్టంవాండ్లపల్లి ప్రజలకు హామీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారులతో పనులు చేపట్టారు. ప్రాజెక్టు ఎగువ భాగంలోని రెండు గ్రామాలు నీట మునిగే పరిస్థితి రావడంతో నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా మరో ప్రాంతానికి తరలించారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో పరిహారం కింద రూ.6 కోట్లు నిధులు మంజూరయ్యాయని నేతలు చెప్పినా ప్రభుత్వ కాల పరిమితి ముగిసే వరకు అందించకపోవడం గమనార్హం.

సీసీ రహదారులకు నోచుకోని నిర్వాసితుల కాలనీ

  •  కడప-బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోని మిట్ట ప్రాంతంలో నిర్వాసితులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. కేవలం కాలనీ ఏర్పాటుకు అవసరమైన మేర లేఅవుట్‌ వేసి స్థలాలు కేటాయించారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ప్యాకేజీలో భాగంగా రూ.90 లక్షలతో నిర్మించతలపెట్టిన పాఠశాల, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. ప్రైవేటు అద్దె భవనలోనే నేటీకీ ఉపాధ్యాయులు పిల్లలకు  తరగతులు నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం వేసిన బోర్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క వీధిలో కూడా సీసీ రహదారి నిర్మించలేదు.
  •  పెరుగుతున్న ధరలకనుగుణంగా తమకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాలని, ఇంటికి రూ.10 లక్షలు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలని పట్టుబట్టారు. గతేడాది అప్పటి వైకాపా ప్రభుత్వం రూ.6 కోట్లు పరిహారం కింద మంజూరు చేస్తూ జీవో విడుదలైంది. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.6.50 లక్షల మేర నిధులిచ్చేందుకు నిర్ణయించారు. సొంతంగా ఇంటిని నిర్మించు కున్నవారికి రూ.3.75 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో చాలామంది నిరాకరించారు. గండికోట జలాశయ నిర్వాసితులకు తరహాలోనే తమకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండు చేస్తున్నారు. పరిహారం చెల్లింపులకు మంజూరైన నిధులు విడుదల కాకపోవడంతో నిర్వాసితులకు పరిహరం నేటికీ అందలేదు. ఎన్డీయే ప్రభుత్వం దృష్టిసారించి పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.

చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం

ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందనే అభియోగాలున్నాయి. నీటిపారుదలశాఖ అధికారులతో చర్చించి నిర్వాసితులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని