logo

గురిపెడితే... పతకాలే

రైఫిల్‌ షూటింగులో బుల్లెట్‌లా దూసుకెళుతున్నారు పసిడిపురి విద్యార్థులు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో పని చేస్తే దేనినైనా సాధించ వచ్చని ఆ విద్యార్థులు నిరూపిస్తున్నారు.

Published : 05 Jul 2024 02:51 IST

జాతీయ, రాష్ట్ర   స్థాయిలో ప్రతిభ
రైఫిల్‌ షూటింగులో రాణిస్తున్న విద్యార్థులు
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు

రైఫిల్‌ షూటింగులో బుల్లెట్‌లా దూసుకెళుతున్నారు పసిడిపురి విద్యార్థులు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో పని చేస్తే దేనినైనా సాధించ వచ్చని ఆ విద్యార్థులు నిరూపిస్తున్నారు. నిత్యం సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ చాటుతూ బంగారు, రజతం, కాంస్య పతకాలు సొంతం చేసుకుంటున్నారు. అటు మాస్టరు, గురువులు, ఇటూ తల్లిదండ్రులకు కీర్తి ప్రఖ్యాతలను తీసుకొస్తున్నారు. నిర్దేశించుకున్న ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ప్రణాళిక రూపొందించుకొని అడుగులు వేస్తున్న ఆ రైఫిల్‌ క్రీడాకారులు విజయాలు తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. వారి లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం.


దేశానికి స్వర్ణ పతకమే నా స్వప్నం

నా పేరు షేక్‌ మహమ్మద్‌ ఉబైద్‌. పదో తరగతి చదువుతున్నా. ప్రొద్దుటూరులోని భగత్‌సింగ్‌ కాలనీలో ఉంటున్నాం. అమ్మ అఫ్సాన బాను, నాన్న జాకీర్‌ హుస్సేన్, ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ నన్ను చదివిస్తున్నారు. 7వ తరగతి నుంచి రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ పొందుతున్నాను. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటాను. జిల్లా అసోసియేషన్‌ స్థాయిలో 2, ఏపీ రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ స్థాయిలో 6, ఎస్‌జీఎఫ్‌ఐ స్థాయిలో 2 మొత్తం 8 బంగారు పతకాలు సాధించాను. జాతీయ స్థాయిలో పాటిస్‌పేట్‌ చేశాను. భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపిక్స్‌కు ఎంపికై దేశానికి బంగారు పతకాన్ని తేవాలని, ఉద్యోగపరంగా ఏరోనాటికల్‌ ఇంజినీరు కావాలని లక్ష్యం పెట్టుకున్నాను.


పోలీసు అధికారిగా సేవ చేస్తా

నా పేరు సుమంత్, ఇంటర్‌ పూర్తి చేశా, బీటెక్‌ చేరుతున్నా. కేవీఆర్‌ కాలనీలో ఉంటున్నాం. అమ్మ ఉమమహేశ్వరి గృహిణి, నాన్న సుబ్రమణ్యం ఫొటో స్టూడియో నడుపుతున్నారు. ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు రాఘవ వద్ద మూడేళ్లుగా రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాను. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో బంగారు 2, రజతం 3, కాంస్య పతకాలు 1 సాధించాను. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ఆలిండియా 8వ స్థానంలో నిలిచాను. రాబోవు రోజుల్లో దేశం తరపున ఆడాలని ఉంది. పోలీసు అధికారిగా ప్రజాసేవ చేయడమే నా ధ్యేయం.


అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తా

నా పేరు షేక్‌ జహర్‌ తాజ్‌. 8వ తరగతి చదువుతున్నా. అమ్మ తస్లీమ్, నాన్న జమాల్‌ పీర్‌ ఆర్మీ అధికారి. పీఈటీ రాఘవ దగ్గర రెండేళ్లుగా రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ తీసుకుంటున్నాను. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చాటాను. 5వ జూనియర్, మొదటి యూత్‌ బౌల్స్‌ స్పోర్ట్స్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రెండు సార్లు పాల్గొని బంగారు, రజతం, ఎస్‌జీఎఫ్‌ఐ రైఫిల్‌ షూటింగ్‌ రాష్ట్రస్థాయిలో రజత పతకాలను సాధించాను. భవిష్యత్తులో ఇంటర్నేషనల్లో ఉత్తమ షూటర్‌ కావాలని, వైద్య వృత్తిలో చేపట్టి ప్రజలకు సేవ చేయడమే నా ఆశయం.


ఇంజినీర్‌ను అవుతా...

నా పేరు వి.మన్వితారెడ్డి, పదో తరగతి చదువుతున్నా. అమ్మ మృధుల, నాన్న అనిల్‌కుమార్‌రెడ్డి వ్యవసాయ రైతు. ఏదో ఒక ఆటలో ప్రావీణ్యం ఉండాలని అమ్మనాన్నలు చెప్పారు. వారి ప్రోత్సాహంతో రైఫిల్‌ షూటింగ్‌లో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచాను. ఏపీ రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ తరపున హైదరాబాద్‌లో ప్రత్యర్థులతో విజయం దిశగా తలపడ్డాను. ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించాను. పీఈటీ రాఘవ వద్ద నిత్యం సాధన చేస్తున్నాను. భవిష్యత్తులో ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌ కావాలని, ఇంజినీరింగ్‌ ఉద్యోగం సాధించడమే నా జీవిత లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు