logo

నాడేమో మమకారం.. నేడేది సహకారం?

అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం.

Updated : 03 Jul 2024 05:17 IST

నడవని అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌
రూ.34 లక్షల విద్యుత్తు బిల్లుల జారీ
మార్కెటింగ్‌శాఖ అధికారుల ఆందోళన
ఈనాడు, కడప

అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. సొంతగడ్డపై మీ మమకారం ఎప్పటికీ తీరేది కాదు.
... ఈ ఏడాది మార్చి 11న ముఖ్యమంత్రి హోదాలో రూ.816.84 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ జగన్‌ అన్నమాటలివి. 

పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అయిదెకరాల్లో రూ.20.15 కోట్లతో నూతనంగా నిర్మించిన అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను మూడు నెలల కిందట ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న నాలుగు కోల్డ్‌ స్టోరేజ్‌లు, 126 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఆరు ప్రీ కూలింగ్‌ ఛాంబర్లు, లేబర్‌ క్వార్టర్స్, యంత్ర గదులు, 60 టన్నుల వేబ్రిడ్జితో పాటు అరటి, చీనీకి సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్‌ లైన్స్‌ ఏర్పాటు చేశారు. యూనిట్‌ను గత మూడు నెలలుగా వినియోగంలోకి తీసుకురాకపోగా, విద్యుత్తు బిల్లులు మాత్రం రూ.34 లక్షల మేర వచ్చింది. ఈ మొత్తం వెంటనే చెల్లించాలని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమణ మార్కెటింగ్‌శాఖకు తాజాగా నోటీసులు జారీ చేశారు. బిల్లు మొత్తాన్ని చూసి మార్కెటింగ్‌ విభాగం అధికారులు కంగుతిన్నారు. తమ విభాగం బడ్జెట్‌ మొత్తం వెచ్చించినా బిల్లు చెల్లించే పరిస్థితి లేదంటూ లబోదిబోమంటున్నారు. ఈ యూనిట్‌ కోసం ప్రత్యేకంగా విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటు చేశారు. వినియోగించినా.. లేకున్నా కనీస బిల్లుగా నెలకు రూ.4 లక్షలు చెల్లించాలనే నిబంధన ఉన్నట్లు ఎస్పీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.34 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. 

ముందుకు రావడంలేదు

యూనిట్‌ను నడపడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాలు సఫలం కాలేదు. ఎవరికో వచ్చిన ఆలోచనతో వెంటనే యూనిట్‌ నిర్మాణం జరిగిపోయింది. ఇంతకీ రైతులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే వ్యవస్థ లేకపోయింది. ఇప్పటికే అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ వృథాగా పడి ఉంది. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన యూనిట్‌ ద్వారా అరటిపండ్లను ముక్కలుగా కోసి తయారు చేసుకునేవిధంగా యూనిట్‌ను స్థాపించారు. దీన్ని గతేడాది అక్టోబర్‌ 4న జగన్‌ ప్రారంభించారు. అరటి మొద్దుల (కాండం) నుంచి తీసిన నారను ఫైబర్‌గా మార్చడంతోపాటు ప్లేట్లు, కప్పులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వీటి తయారీ, మార్కెటింగ్‌ జరగలేదు. మంచి ఆశయంతో దీన్ని ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా నేతలు ప్రజాధనాన్ని వెచ్చించి స్థాపించిన యూనిట్లు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. రూ.కోట్లు వెచ్చించామంటూ గొప్పలు తప్ప... ప్రజాప్రయోజనం ఎంత మేరకు అనే పరిశీలన జరగడంలేదు. దీంతో పులివెందులలో చేపట్టిన అభివృద్ధి పనులు చాలా వరకు వృథాగా ఉండిపోయాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని