logo

పెచ్చులూడిన పాఠశాల భవనం పైకప్పు!

కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.

Published : 03 Jul 2024 04:12 IST

ఆరుగురు విద్యార్థులకు గాయాలు... ఆసుపత్రికి తరలింపు 
వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి విద్యాసంస్థలో ఘటన
గతంలోనే ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు 
ప్రమాదంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప నేరవార్తలు

డప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయం కాగా, మరో విద్యార్థికి చేయి విరిగింది. వీరిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మీడియా ఎదురుపడడంతో దొంగచాటుగా తరలించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఘటన జరగ్గా పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా గాయపడిన విద్యార్థులను నేరుగా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించిన అనంతరం వారి ఇళ్ల వద్ద వదిలేసి రావడం గమనార్హం.

ప్రమాదంపై సమాచారమందుకున్న ఆర్డీవో మధుసూదన్, డీఈవో అనూరాధ, తహసీల్దార్‌ వెంకటరమణ, పోలీసు అధికారులు పాఠశాలకు చేరుకుని ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. పాఠశాల ఎదుట వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తక్షణమే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. విద్యాశాఖాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆయన భార్య, పాఠశాల కరస్పాండెంట్, కార్పొరేటర్‌ శ్రీదేవి, కుమారుడు సుధీర్‌రెడ్డిలపై కడప తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తరగతి గది పైకప్పు కూలిందని విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులు చేసినా పట్టని అధికారులు: పాఠశాల నిర్వహణ, తరగతి గదుల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని గత నెల 18న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవి జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు కమిషనరుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు తమ ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతోనే ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఛైర్మన్‌ వైకాపా చెందిన కీలక నేత కావడంతోనే ఫిర్యాదులపై స్పందించలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. 

మంత్రి లోకేశ్‌ స్పందనతో అధికారుల పరుగులు: ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ఆరుగురు విద్యార్థులు గాయపడిన ఘటన కలిచివేసిందన్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని