logo

నేల ఆరోగ్యానికి భరోసా!

గత వైకాపా ప్రభుత్వ పాలనలో భూసార పరీక్షలపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. మాది రైతురాజ్యం అంటూ గొప్పగా ప్రచారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఏలుబడిలో కాసులివ్వకుండా దగా చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Published : 03 Jul 2024 03:52 IST

భూసార పరీక్షలకు ఎన్డీయే సర్కారు ఆదేశం
వైకాపా పాలనలో నిధులివ్వకుండా నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, కడప 

గత వైకాపా ప్రభుత్వ పాలనలో భూసార పరీక్షలపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. మాది రైతురాజ్యం అంటూ గొప్పగా ప్రచారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఏలుబడిలో కాసులివ్వకుండా దగా చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది వచ్చిన నమూనాలకు యజ్ఞంలా విశ్లేషణ చేయాలని ఉత్తర్వులిచ్చారు. కొత్తగా సేకరించాలని మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. 

వైఎస్‌ఆర్‌ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో 10 వేల మట్టి నమూనాలు సేకరించి ఊటుకూరు భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. అక్కడ యంత్ర పరికరాల మరమ్మతులు, రసాయనాల కొనుగోలుకు నిధుల్లేకపోవడంతో పక్కన పడేశారు. విశ్లేషణ ఫలితాల సమాచారమివ్వాలని రైతులు అడిగితే త్వరలో అందజేస్తామని చెబుతూ వచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక గత వైకాపా జమానాలో నిర్లక్ష్యానికి గురైన రంగాలు, విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గతేడాది సేకరించిన మట్టి నమూనాలకు పరీక్షలు చేయాలని ఆదేశాలు అందాయి. వీటి ఫలితాల ఆధారంగా భూసారం పెంపు, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అధికారులు సూచనలివ్వనున్నారు. 

తొలి విడతలో నిధులకు అనుమతి

వైఎస్‌ఆర్‌ జిల్లాకు తొలి విడతలో రూ.6.50 లక్షల నిధులు ఇవ్వడానికి అనుమతిచ్చారు. సంచార వాహన విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే 3,548 నమూనాలు పరీక్షించారు. ఇక్కడ సేవలందించడానికి అదనంగా ఆరుగురు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 17,800 నమూనాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు డివిజన్, మండలం, రైతు భరోసా కేంద్రాల వారీగా లక్ష్యాలు కేటాయించారు. అన్నమయ్య జిల్లాలో గతేడాది 10,968 మట్టి నమూనాలు సేకరించి ఊటుకూరు కేంద్రానికి చేర్చారు. వీటి పరీక్షల నిమిత్తం తొలివిడతలో రూ.7.10 లక్షలు ఇచ్చారు. అదనంగా మరో ఇద్దరు ఏఈవోలు, నలుగురు వీఏఏలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే 3,697 నమూనాలు పరీక్షించారు. ఈసారి మరో 16,500 నమూనాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. 


పరీక్షలు వేగవంతం చేస్తాం

- ఎ.నాగేశ్వరరావు, డీఏఓ, కడప 

గతేడాది వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సేకరించిన మట్టి నమూనాలను ఊటుకూరు కేంద్రానికి పంపించాం. అప్పట్లో పరీక్షలు చేయలేదు. ఈ సారి విశ్లేషణ ప్రక్రియను చేపట్టి వెంటనే ఫలితాలను రైతులకు అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందడంతో వేగవంతంగా చేయిస్తున్నాం. ఈ ఏడాది కూడా మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యాలు నిర్దేశించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని