logo

వెలిగల్లు.. ఆయకట్టుకేవీ నీళ్లు?

సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు.

Published : 03 Jul 2024 03:50 IST

 ప్రాజెక్టును గాలికొదిలేసిన గత వైకాపా సర్కారు 
4 వేల ఎకరాలకు అందని సాగునీరు 
ఎన్డీయే ప్రభుత్వంపైనే అన్నదాతల గంపెడాశలు 
న్యూస్‌టుడే, రాయచోటి, గాలివీడు

సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, గత 16 ఏళ్లుగా ఎకరా భూమికి కూడా సాగునీరందించలేదు. 2008లోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ప్రధాన కాలువల నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు నిర్మిత సమయంలోనే కుడి, ఎడమ కాలువలు తవ్వినా అప్పట్లో భారీ అవినీతి చోటుచేసుకోవడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. 

వెలిగల్లు ప్రాజెక్టులోని నీటిని పలుమార్లు వైకాపా నేతలు గేట్లు ఎత్తి దిగువన పాపఘ్ని నదికి వదిలేశారు. ఎన్నికల సమయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రాజెక్టు కాలువ గేట్లు ఎత్తి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని చివరి వరకు నీరు వృథాగా వదిలేయడంతో 4.25 టీఎంసీల నీటితో నిండుకుండలా ఉండాల్సిన ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. దీంతో పంటలు సాగు చేసుకునే అవకాశం లేక రైతులు దినకూలీలుగా మారాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని గాలివీడుకు చెందిన రైతు రెడ్డెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కాలువలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


రూ.10 కోట్ల నిధులు ఏమయ్యాయో..? 

వెలిగల్లు ప్రాజెక్టు నీటిని ఆయకట్టుకు అందించి రైతులను ఆదుకుంటామని 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా పాలకులు ప్రకటించారు. రెండేళ్ల కిందట పిల్ల కాలువల నిర్మాణానికి రూ.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు కొంత మేర చేసి నిలిపేశారు. ఇప్పటికే పూర్తయిన పనులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో సగం పనులు కూడా పూర్తి కాకుండానే వెళ్లిపోయారు. ఫలితంగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద ఉన్న 24 వేల ఎకరాల ఆయకట్టుకు చుక్కనీరందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులో నీరున్నా పొలాలకు అందించే అవకాశం లేకపోవడంతో రైతులు రూ.లక్షలు వెచ్చించి బోరు బావులు వేసుకొని పంటలు సాగుచేసుకోవాల్సి వస్తోంది. 


ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

- శిరీష్‌కుమార్, డీఈ వెలిగల్లు ప్రాజెక్టు 

వెలిగల్లు ప్రాజెక్టు కాలువల ద్వారా సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎడమ కాలువలో పూడిక తొలగింపుతోపాటు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కుడి కాలువలో సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేదు. పిల్ల కాలువల గేట్లకు మరమ్మతులు చేయించి ఆయకట్టుకు సాగునీరందిస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని