logo

కర్ర తిప్పుతూ.. కత్తి దూస్తూ

మన సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాముల్లో యువతులు సత్తా చాటుతున్నారు. ఇది వారికి స్వీయ రక్షణతో పాటు, శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించడానికి దోహదపడుతుంది.

Updated : 03 Jul 2024 05:27 IST

యుద్ధ కళల్లో రాణిస్తున్న యువతులు 
జాతీయ స్థాయిలో సత్తా
న్యూస్‌టుడే, కడప క్రీడలు 

మన సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాముల్లో యువతులు సత్తా చాటుతున్నారు. ఇది వారికి స్వీయ రక్షణతో పాటు, శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించడానికి దోహదపడుతుంది. దీనిని నేర్చుకోవడానికి పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. మాస్టర్‌ డి.జయచంద్ర ఆధ్వర్యంలో జిల్లా క్రీడాకారిణులు శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. 

ఎలాంటి ఆపద వచ్చినా ఎదుర్కొంటా...

- పి.దీక్షిత 

మాది కమలాపురం మండలం పెద్దపుత్త. కడప నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నా. అమ్మానాన్నలు పి.వెంకటశివారెడ్డి, స్వప్నసుందరదేవి. వ్యవసాయం చేసుకుంటూ నన్ను చదివిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి ఈ యుద్ధ క్రీడల్లో శిక్షణ పొందుతున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటాను. జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించా. నాసిక్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచా. ఈ శిక్షణ పొందిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారయ్యాను. ఏకాగ్రత పెరిగింది. ఎలాంటి ఆపద వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా నాకుంది.


ఆత్మరక్షణకు దోహదం

- పి.చంద్రకళ 

బద్వేలు మండలం ప్రబలవీడు గ్రామానికి చెందిన నేను కడప నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేశాను. తల్లిదండ్రులు శ్రీనివాసులరెడ్డి, సరస్వతి వ్యవసాయం చేస్తారు. కళాశాలలో చేరిన ఏడాది నుంచే కర్రసాము, కత్తిసాములో శిక్షణ తీసుకున్నా. కేరళ యుద్ధ క్రీడ కలరిపయట్టులో కూడా తర్ఫీదు పొందా. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది పైగా ప్రదర్శనలు చేశా. మూడు సార్లు జాతీయ స్థాయిలో పాల్గొని రెండు సార్లు బహుమతులు సాధించా. ఈ యుద్ధక్రీడల్లో ఆత్మరక్షణకు ఎంతో దోహదపడతాయి.


ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని...

 - ఎన్‌.గంగోత్రి

మాది వేంపల్లి మండలం నాగూరు. కడప ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నా. తల్లిదండ్రులు ఎన్‌.గంగయ్య, నాగమునెమ్మ. రెండేళ్ల నుంచి శిక్షణ పొందుతున్నా. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఐదు సార్లు పోటీపడి ఉత్తమ ప్రదర్శన చేశా. జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నా. మేము మొత్తం ఆరుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని నాకు శిక్షణ ఇప్పిస్తున్నారు. నేను ఇంట్లో మా అక్కాచెల్లెళ్లకు నేర్పిస్తున్నా.  


ప్రధాని ఎదుట ప్రదర్శన మరిచిపోలేనిది

 - ఒ.శ్రుతి  

కడప ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నా. తల్లిదండ్రులు గంగిరెడ్డి, గంగాదేవి వ్యవసాయదారులు. వారి ప్రోత్సాహంతో గత మూడేళ్ల నుంచి శిక్షణ యుద్ధ క్రీడల్లో తీసుకుంటున్నా. జిల్లా స్థాయిలో మూడుసార్లు, రాష్ట్రస్థాయిలో రెండు సార్లు, జాతీయ స్థాయిలో రెండుసార్లు పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేశా. మహరాష్ట్రలోని నాసిక్‌లో ప్రధానమంత్రి ముందు ప్రదర్శన చేయడం మరిచిపోలేని అనుభూతి. భవిష్యత్తులో మరింత అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి ఆత్మస్థైర్యం పెంపొందించడమే నా లక్ష్యం.      

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని