logo

సత్యం వధ.. ధర్మం చెర!

అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు.

Updated : 01 Jul 2024 06:22 IST

అయిదేళ్లు అష్టకష్టాలు

రాష్ట్రంలో ఈ నియోజకవర్గానికి తాలిబాన్‌ రాజ్యమని పేరు... అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా...భూ ఆక్రమణలు, ఇసుక అక్రమ రవాణా, కబ్జాలు,దౌర్జన్యాలు ఇక్కడ నిత్యకృత్యం... ఇక్కడి వైకాపా ప్రజా ప్రతినిధి దోపిడీకి మండలాల వారీగా నాయకులు ప్రైవేటు సైన్యంగా మారగా వారికి రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు వంత పాడారు. దీంతో వైకాపా ప్రభుత్వ హయాంలో అయిదేళ్లు వీరి దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు భౌతిక దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేశారు. పోలీసులు ఐపీసీని పక్కనపెట్టి వైసీపీ రాజ్యాంగాన్ని నడిపించారు. అలా అంటకాగి ఆరోపణలు  ఎదుర్కొంటున్న అధికారులు నేటికీ అక్కడే పాతుకుపోయి ఉండడం గమనార్హం.

న్యూస్‌టుడే, మదనపల్లె, తంబళ్లపల్లె

అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. పేదలను హింసించి, అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై కూడా కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. గళం విప్పి ప్రశ్నిస్తే బెదిరింపులు... వైకాపా నాయకులపై వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తే ప్రత్యక్షదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే బాధితులపైనే రివర్స్‌ కేసులు బనాయింపు. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా చరిత్రకెక్కిన తంబళ్లపల్లెలో పనిచేసిన అధికారులు తీవ్రమైన ఆరోపణలను మూటకట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో రాజ్యాంగం చిన్నబోగా, ప్రజాస్వామ్యం కనుమరుగైంది. చట్టాలు అధికార పార్టీ నాయకుల చుట్టాలయ్యాయి.

పీటీఎం మండలంలో పాపఘ్ని నదిలో ఇసుకను తోడేసి రాష్ట్ర సరిహద్దులు దాటించడంతో అధికారులు అధికార పార్టీ నాయకులకు అండగా నిలిచారన్న విమర్శలున్నాయి. రోజుకు కొన్ని వందల లారీల ఇసుక సరిహద్దులు దాటుతున్నట్లు సమాచారం. తహసీల్దారుగా డీటీని నియమించి అర్హత లేకపోయినా, అధికార పార్టీ నాయకుల అండదండలతో వారి అక్రమ కార్యకలాపాలకు అండదండగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో అక్కడ తహసీల్దారుగా, ప్రస్తుతం డీటీగా పనిచేస్తున్న విద్యాసాగర్‌పై తీవ్రమైన ఆరోపణలున్నాయి. అలాగే అప్పట్లో పనిచేసిన ఎస్సైలు మధురామచంద్రుడు, రవీంద్రబాబు తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వీరి వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ఇసుక అక్రమ రవాణాపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎంపీడీవోగా పనిచేస్తున్న గిరిధర్‌రెడ్డి ఫక్తు వైకాపా నాయకుడిగా మారి తన స్వామిభక్తి చాటుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను అధికార పార్టీ అండతో స్థానిక ప్రజలను తీవ్రమైన వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. ములకలచెరువు, పీటీఎం, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో కోడిపందేలు, జూదాలు నిర్వహించుకోవడానికి పోలీసులు అధికార పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం పూర్తి సహకారం అందించారన్న విమర్శలున్నాయి. అప్పట్లో ములకలచెరువు సీఐగా పనిచేసిన సురేష్‌కుమార్‌ వైకాపా నాయకులతో అంటకాగారన్న ఆరోపణలున్నాయి. పీటీఎం, ములకలచెరువు మండలాల్లో ఇసుక అక్రమ రవాణాకు ఇతను పూర్తి సహకారం అందించినట్లు ప్రచారం సాగుతోంది. పెద్దమండ్యం మండలంలో ఎస్సైగా పనిచేసిన వెంకట శివకుమార్, ఎంపీడీవో శ్రీధర్‌రావు అప్పట్లో అధికార పార్టీ నాయకులతో అంటకాగారన్న విమర్శలున్నాయి. ఇలా మిగిలిన మండలాల్లో రాష్ట్రంలో అధికారం మారినా తంబళ్లపల్లె నియోజకవర్గంలో మాత్రం అధికారుల పనితీరులో మార్పు రాలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

అక్రమాల అడ్డా అంగళ్లు

నియోజకవర్గంలోని అక్రమాల్లో అంగళ్లుదే సింహభాగం. ఇక్కడ జరిగిన భూ కబ్జాలు మరెక్కడా జరగలేదని స్థానికులు నోరెళ్లబుచ్చుతున్నారు. అప్పట్లో ముదివేడు పోలీసు స్టేషన్‌ ఎస్‌.ఐ.గా పనిచేసిన సుకుమార్, రవీంద్రబాబు వైకాపా కార్యకర్తలుగా మారిపోయి స్వామి భక్తిని చాటుకున్నారన్న విమర్శలున్నాయి. 2020లో తెదేపా కార్యకర్తపై కేసు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకుని స్థానిక నాయకుడు సురేంద్రయాదవ్‌ స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నించినందుకు అతనిపై కూడా కేసు నమోదు చేశారు. ఇతని ఇంట్లో మద్యం సీసాలు ఉంచి అక్రమ మద్యం ఉన్నట్లు మరో కేసు నమోదు చేశారు. ఇక భూ ఆక్రమణల్లో అధికారులు కీలక భూమిక పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. అంగళ్లు పరిసర ప్రాంతాల్లో భూ వివాదాలు సెటిల్‌మెంట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే వారికి వీరి అండదండలు మెండుగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై అంగళ్లులోనే రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు వందల మంది తెదేపా నాయకులు, కార్యకర్తలపై రివర్స్‌ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. ఇందులో అప్పట్లో పనిచేసిన సీఐలు శివాంజినేయులు, అశోక్‌కుమార్‌ స్వామిభక్తిని చాటుకుని వైకాపా నాయకులతో అంటకాగారని విమర్శలున్నాయి. అంగళ్లు సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాల వెనుక, కంటేవారిపల్లె వద్ద, ముదివేడు క్రాస్‌ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి లేఅవుట్లు వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సెటిల్‌మెంట్లు ఎక్కువగా పోలీసు ఠాణాలోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం తెదేపా నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలను కూడా వేధింపులకు గురి చేసినట్లు ఆ నియోజకవర్గంలోని ప్రజలు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని