logo

వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!

గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు.

Published : 01 Jul 2024 03:42 IST

నిద్ర మత్తులో జిల్లా  పరిషత్‌ యంత్రాంగం
కొత్త ప్రభుత్వం రాకతో గుత్తపత్రాలకు ఆహ్వానం

గండికోట జలాశయంలో ముద్దనూరు తాగునీటి పథకం

న్యూస్‌టుడే, కడప, కొండాపురం: గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. నిర్దేశిత ఒప్పందం గడువు ముగిసేలోపు మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంది. ఈసారి జిల్లా పరిషత్తు ఉన్నతాధికారులు ఈ మాటను మరిచారు. గత వైకాపా పాలన అధికారంలో ఉన్న సమయంలో ఈ ఏడాది జనవరి 20న పరిపాలన అనుమతిచ్చారు. అనంతరం అప్పట్లో అధికార పార్టీ కీలక నేతల నుంచి ఒత్తిడి రావడంతో పక్కన పెట్టేశారు. జడ్పీలో చక్రం తిప్పుతున్న కీలక అధికారి నిర్వాకంతో రూ.కోట్లు విలువ చేసే పనులను సకాలంలో గుత్తేదారులకు అప్పగించలేని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నిద్రపోయారు. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఇప్పుడేమో తెగ హడావుడి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి కడప జిల్లాలో సీపీడబ్ల్యూ పథకాలు 22 ఉన్నాయి. వీటి ద్వారా 1,096 గ్రామాల్లో నివాసం ఉంటున్న అయిదు లక్షల మందికి శుద్ధి జలాలు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో నిర్వహణ కోసం రూ.13.06 కోట్లు కావాలని అంచనా వేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఏడాది పాటు గడువు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ సాంకేతిక నిపుణులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించాలి. జిల్లా పరిషత్తు అధికారులు పరిపాలన అనుమతిచ్చి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈసారి ముందస్తుగానే జనవరి 20న జడ్పీలో నిర్వహణ కోసం రూ.13.66 కోట్లు, కరెంటు బిల్లుల చెల్లించడానికి మరో రూ.16.06 కోట్లు చెల్లించడానికి పాలనామోదం ఇచ్చారు. వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్‌ యంత్రాంగం నుంచి ఏ స్కీంలో ఏ పనులు చేయడానికి ఎంత సొమ్ము కావాలని అంచనాలు (ఎస్టిమెట్లు) తెప్పించి టెండర్లు పిలవాలనే మాటను మరిచారు.

సార్వత్రిక పోరు సాకు

సార్వత్రిక పోరు రావడంతో టెండర్లు పిలవడానికి వీలు కాలేదని జడ్పీ యంత్రాంగం చెబుతోంది. ఈ ఏడాది జనవరి 20న పరిపాలనమోదం ఇవ్వగా మార్చి 16న ఎన్నికల కోడ్‌ కూసింది. ఈ మధ్యలో 55 రోజులు ఉంది. మరి ఇన్నాళ్లు ఏం చేశారు, ఎందుకు టెండర్లు పిలవలేదని ప్రశ్నిస్తే జడ్పీ యంత్రాంగం నోరు మెదపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ గుత్తపత్రాలను పిలవలేదు కదా అంటూ దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎన్నికలను సాకు చూపడం జడ్పీ యంత్రాంగం చేతగానితనానికి నిదర్శనం. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షణ చేస్తున్న తాగునీటి సరఫరా శాఖ, జడ్పీ అధికారుల పనితీరు చూస్తే ఎవరిదారి వారిదే అన్నట్లు ఉంది. రెండు విభాగాల యంత్రాంగం మధ్య అసలు సమన్వయం లేదు. అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపడం వరకే మా పని. టెండర్లు పిలిచి పనులు పొందిన గుత్తేదారుతో జడ్పీ అధికారులు ఒప్పందం చేసుకుంటే తర్వాత పర్యవేక్షణ చేయడం మా విధి అంటున్నారు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు.

ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లె శివారులో కొత్తమాధవరం తాగునీటి పథకం పంపుహౌస్‌

కొత్త ప్రభుత్వం రాకతో...

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఎట్టకేలకు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 22 సీపీడబ్ల్యూ స్కీంల నిర్వహణకు గత నెల 25న రూ.13.06 కోట్లకు అనుమతిచ్చారు. ఈ మేరకు టెండర్లు పిలిచారు. మాధవరం-1 రూ.41 లక్షలు, పొందలూరు రూ.42 లక్షలు, కమలాపురం రూ.42 లక్షలు, వేంపల్లె రూ.43.50 లక్షలు, పులివెందుల అప్‌ల్యాండ్స్‌ రూ.48 లక్షలు, గాలివీడు రూ.53 లక్షలు, వైవీయూ రూ.63 లక్షలు, బ్రహ్మంగారిమఠం రూ.65 లక్షలు, కొండాపురం రూ.69 లక్షలు, ముద్దనూరు రూ.80.5 లక్షలు, మైలవరం రూ.92 లక్షలు, మైదుకూరు రూ.105 లక్షలు, పులివెందుల రూ.145 లక్షలు, లక్కిరెడ్డిపల్లె పథకానికి రూ.226 లక్షలకు అనుమతిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్‌ నెలలు కరిగిపోయాయి. వచ్చే నెల నుంచి 2025 మార్చి వరకు తొమ్మిది నెలలే మిగిలి ఉంది. మరి టెండర్లు వచ్చే ఏడాది మార్చి వరకు నిర్వహిస్తారా, అదనపు గడువు ఇస్తారా అనేది గుత్తేదారుల్లో చర్చ జరుగుతోంది.

నాటి పాలకుల వైఫల్యాలివి

వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో తాత్కాలికంగా టెండర్లు పిలవకుండా ఆపేశారు. వాస్తవంగా ఈ ఏడాది మార్చి 31 లోపు గుత్తపత్రాలు పిలవాలి. ఎవరైతే తక్కువ నమోదు చేస్తారో నిబంధనలను అనుసరించి వారిని ఎంపిక చేసి ఏప్రిల్‌ 1 నుంచి గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించాలి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా పనులు దక్కించుకోవడానికి పోటీపడి తక్కువగా (లెస్‌ ఎక్కువ) నమోదు చేస్తే తమ వర్గీయులకు నిర్వహణ బాధ్యతలు దక్కవని వైకాపా నాయక గణం కొత్త ఎత్తుగడ వేసింది. సార్వత్రిక ఎన్నికల వరకు నెట్టుకు రావాలని ఉన్నతస్థాయి నుంచి మౌఖీక ఆదేశాలు రావడంతో మనోళ్లు కూడా కాదనకుండా తలాడించేశారు. జిల్లా పరిషత్తులో కీలక అధికారి అంతాతానై కథ నడిపిస్తున్నారు.

అయిదేళ్లూ వేధింపులే

వైకాపా ప్రభుత్వం (2019-2024) పాలనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది గుత్తేదారులు ముందుకొస్తే వారిని దరిదాపుల్లోకి రాకుండా అధికార పార్టీ నాయకులు భయపెట్టారు. మా సామ్రాజ్యంలో సీపీడబ్ల్యూ స్కీం నిర్వహణ దక్కించుకొంటే పనులు చేయలేవు. మీ పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. బిల్లులు రాకుండా అడ్డుకుంటాం అంటూ ఆయా ప్రాంతంలోని వైకాపా నేతలు హెచ్చు స్వరంతో మాట్లాడటంతో చాలామంది వెనకడుగు వేశారు. కొంతమంది టెండరు వేసినా ఒత్తిడి తట్టుకోలేక, వేధింపులు భరించలేక చేతికొచ్చిన పనులను అధికార పార్టీకి వారికే కట్టబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
అంచనాలు రావడంలో జాప్యంతోనే : ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 22 సీపీడబ్ల్యూ పథకాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ కోసం ఈ ఏడాది జనవరిలో పరిపాలన అనుమతిచ్చాం. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారుల నుంచి పథకం వారీగా ఏ పనులను చేయాలి, ఇందుకోసం రూ.ఎన్ని లక్షలు కావాలో అంచనాలు రూపొందించి సకాలంలో ప్రతిపాదనలు అందించలేదు. ఈ కారణంగా ముందస్తుగా టెండర్లు పిలవలేకపోయాం. ఈలోపు సార్వత్రిక ఎన్నికలు రావడంతో గుత్తపత్రాలను ఆహ్వానించలేకపోయాం. గత వారం టెండర్లు పిలవడానికి ఉత్తర్వులిచ్చాం.

సుధాకర్‌రెడ్డి, సీఈవో, జిల్లా పరిషత్తు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని