అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!

జిల్లా పరిషత్‌ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్‌రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు.

Updated : 01 Jul 2024 05:55 IST

కడపలో విలువైన స్థలాలు అన్యాక్రాంతం
నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్ణయాలు
వైకాపా నేతల అండతో బరితెగింపు
జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తీరుపై విమర్శల వెల్లువ

ఆక్రమిత జడ్పీ స్థలంలో వైకాపా నేత నిర్మించిన హోటల్‌

ఈనాడు, కడప

  • జిల్లా పరిషత్‌ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్‌రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. ఏమాత్రం భయం లేకుండా ఇష్టారాజ్యంగా ఆస్తుల్ని అంటగట్టేశారు. పక్క జిల్లా చిత్తూరులో సీఈవో ప్రభాకర్‌రెడ్డి సస్పెండ్‌ అయిన తరుణంలోనూ ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా ఇప్పటికీ ప్రవర్తిస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడ్డ అక్రమార్కులకు సహకరిస్తూ తన పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. వైకాపా హయాంలో నిబంధనలు ఉల్లంఘించి సాగించిన వ్యవహారాల్లో మచ్చుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే...!
  • కడపలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను నామినేషన్‌పై ఓ ప్రైవేటు కళాశాలకు కట్టబెట్టేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు బహిరంగ నోటీసు జారీ చేయడం, పారదర్శకంగా టెండరు విధానం కింద లీజుకు ఇవ్వాల్సి ఉండగా... ఈ ప్రమాణాలను తుంగలో తొక్కి డిపాజిట్‌ కింద రూ.28 లక్షలు తీసుకుని.. నెలకు ఒక్కో సముదాయానికి రూ.10 వేలు వంతున అద్దె ఖరారు చేశారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ చర్చకు పెట్టకుండా గోప్యంగా సంతకాలు తీసుకుని మమ అనిపించేశారు.
  • జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట అన్న క్యాంటీన్‌ను రూ.40 లక్షలు వెచ్చించి నగరపాలక సంస్థ భవనాన్ని నిర్మించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక మూతవేయగా.. దాన్ని ప్రైవేటు హోటల్‌కు సైతం నామినేషన్‌పై ఇచ్చేశారు. హోటల్‌ తెరిచిన తర్వాత వ్యవహారం వెలుగులోకి రాగా.. కలెక్టర్‌ మందలించడంతో వెనక్కి తగ్గారు. సొంత స్థలమైనప్పటికీ నగరపాలక సంస్థ నిర్మించిన భవనాన్ని తాకట్టుపెట్టేశారు.
  • జడ్పీ ప్రాంగణానికి చివరన వైకాపా కార్పొరేటర్‌ భర్త రూ.కోట్లు విలువైన స్థలాన్ని ఆక్రమించుకుని హోటల్‌ సైతం నిర్మించేశాడు. వైకాపా అధికారంలో ఉండగా నిర్మాణాలు చేపట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... సందడిగా ప్రారంభం సైతం చేశారు. స్థలం ఆక్రమించినా, హోటల్‌ నిర్మాణం జరుగుతున్నా సీఈవో పట్టించుకోలేదు. వ్యవహారంపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో నెమ్మదిగా వెళ్లి ఒకటో పట్టణ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసి తాపీగా కూర్చున్నారు. వెంటనే హోటల్‌ను స్వాధీనం చేసుకుని జప్తు చేసే అధికారం ఉన్నప్పటికీ  హోటల్‌ యజమాని కోర్టు మెట్లెక్కడానికి కావాల్సినంత సమయం వ్యూహాత్మకంగా ఇచ్చారనే విమర్శలున్నాయి.
  • జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేసిన ఆకేపాటి అమరనాథ్‌రెడ్డికి భారీ మొత్తంలో జడ్పీ నిధులు కట్టబెట్టడంతో పాటు ఆ నిధులతో చేపట్టిన పనులను సంబంధంలేని ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేయించినట్లు ఆరోపణలున్నాయి. పనులు చేయకనే బిల్లులు చేసుకోవడానికి సాధారణంగా చేపట్టే పంచాయతీరాజ్‌ శాఖకు కాకుండా ఇతర విభాగానికి ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. జడ్పీ నిధులను ఇష్టారాజ్యంగా వైకాపా నేతలకు దోచిపెట్టారనే ఆరోపణలున్నాయి.
  • ఓ ప్రైవేటు కళాశాలకు భవనాలు లీజుకివ్వగా వచ్చిన డిపాజిట్‌ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో కాకుండా తనకు అనుకూలమైన చోట పెట్టడం విమర్శలకు దారితీసింది.
  • గాలివీడు మండలంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న సమయంలో రూ.4 కోట్లు వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగి నుంచి సంబంధిత నిధులు రికవరీ చేయాల్సి ఉండగా ఆ కేసును తొక్కిపెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కళాశాలకు లీజు, అన్నక్యాంటీన్‌ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, జడ్పీ స్థలం ఆక్రమణ, హోటల్‌ నిర్మాణంలో భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలతో పాటు నిబంధనల ఉల్లంఘన జరిగింది. ప్రభుత్వం విచారణ చేపట్టి జడ్పీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని