logo

మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 01 Jul 2024 05:38 IST

బోధిస్తున్న ఉపాధ్యాయుడు

కడప విద్య, మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా పాలనలోని అయిదు సంవత్సరాల్లో ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో చాలా మంది డీఎస్సీ పూర్తి చేసి టెట్‌ పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తుండగా చాలా మంది వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌ ఇచ్చింది. అది కూడా ఎన్నికల కోడ్‌ ముందు ఇవ్వడంతో అది కాస్త పెండింగ్‌ పడిపోయింది. దీంతో ఎంతోమంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆశపై నీళ్లు చల్లినట్లైంది. తాము అధికారంలోకి వస్తూనే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాట మేరకు బాధ్యతలు తీసుకున్న రోజే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ కంటే రెండు రెట్లు అధికంగా పోస్టులు భర్తీ చేస్తుండటంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా తాము డీఎస్సీలో ఉద్యోగం పొందాలని చూస్తున్నారు. జులై 1వ తేదీన ప్రకటన వెలువడనుండటంతో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
గొడ్డలిపెట్టుగా జీవో 117 : జీవో నెంబర్‌ 117 అమలు, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరేదైనా వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్య ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలపై విధ్వంసం జరిగింది. వీటి పేరుతో అనేక పాఠశాలలు మూసివేయడం, ఎస్‌జీటీ పోస్టులను పూర్తిగా లేకుండా చేయడం తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయ లోకం ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, రోడ్డెక్కి గళమెత్తినా ఏ మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించడం, మెగా డీఎస్సీ ప్రకటనలతో విద్యాశాఖ, ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ప్రాథమిక విద్య గాడిలో పడేందుకు ప్రస్తుత ప్రభుత్వం తగిన చర్యలతో ముందుకెళ్లనుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ చర్యలతో ఎస్‌జీటీ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయంపై శాఖలో సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ చర్యలతో వీటి సంఖ్య తేలనుంది. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ జిల్లాలో బయాలజీ 21, ఆంగ్లం 33, హిందీ 35, గణితం 42, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 63, ఫిజికల్‌ సైన్స్‌ 19, సాంఘిక శాస్త్రం 28, తెలుగు 59 ఉర్దూ 3 చొప్పున స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికార వర్గాల సమాచారం.

ఎన్నాళ్లో వేచిన ఉదయం

అయిదు సంవత్సరాలు డీఎస్సీ నోటిపికేషన్‌ విడుదల కాక ఎంతో మంది డీఎస్సీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తూనే మెగా డీఎస్సీపై సంతకం చేయడం చాలా సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడు. నిరుద్యోగుల కష్టాలు ఆయనకు మాత్రమే తెలుసుకాబట్టి మెగా డీఎస్సీ విడుదల చేశారు.  ఉపాధ్యాయుడు కావాలన్నదే నా లక్ష్యం.

శ్రీనివాసులు, డీఎస్సీ అభ్యర్థి, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని