logo

కరెంట్‌ కష్టాల్లో కర్షకులు

2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని ఊరూరా ప్రచారం చేశారు.

Published : 29 Jun 2024 03:24 IST

వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్తు
సరఫరాలో అంతరాయాలతో అవస్థలు
తొమ్మిది గంటలివ్వాలంటూ వేడుకోలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై గంపెడాశలు

2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని ఊరూరా ప్రచారం చేశారు. ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన అనంతరం మాట మార్చేశారు. మడమ తిప్పేశారు. వాస్తవంగా ఒకే విడతలో ఏడు గంటలు సరఫరా చేయడమే గగనమైంది. దీనికితోడు అప్రకటిత కోతలు మరింత వేదనకు గురి చేయడంతో అన్న దాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సకాలంలో నీటితడులు అందించడానికి నానా తంటాలు పడుతున్నారు.

న్యూస్‌టుడే, కడప

ఉమ్మడి కడప జిల్లాలో 1,88,837 వ్యవసాయ సర్వీసులున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పర్యవేక్షణలో ఉన్న కడప డివిజన్‌లో 10,745, ప్రొద్దుటూరులో 24,092, పులివెందులలో 32,187, రాయచోటిలో 33,133, రాజంపేటలో 43,873, మైదుకూరులో 44,807 కనెక్షన్లు ఉన్నాయి. పంటల సాగుకు విద్యుత్తు సరఫరా కోసం 857 ఫీడర్లను ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వైకాపా పాలనలో చోటుచేసుకున్న విధానపరమైన లోపాలను సరిదిద్దే పనిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిమగ్నమయ్యారు. ఖరీఫ్‌లో కరెంటు కష్టాలు రాకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కర్షకులు కోరుతున్నారు.   పెన్నానది, చిత్రావతి, పాపఘ్ని, సగిలేరు, కుందూ, చెయ్యేరు, గుంజనేరు, పింఛ నదుల పరివాహక ప్రాంతంలో రైతులు విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పైర్లకు సకాలంలో నీరందాలంటే ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్తు చాలడం లేదు. అన్ని ఫీడర్లలో కాకపోయినా ఎక్కువగా అవసరమైన ప్రాంతాల్లో తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయాలని కర్షకులు కోరుతున్నారు. ఎస్పీడీఎసీల్‌ అధికారులను కలిసి ఇప్పుడు ఇస్తున్న ఏడు గంటలే కాకుండా అదనంగా మరో రెండు గంటలు ఇవ్వాలని రైతులు విన్నవిస్తున్నారు. ఇప్పుడు ఏ గ్రూపులో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, బి గ్రూపులో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా చేస్తున్నారు. మోస్తరుగా వర్షం కురిసినా, గాలి వీచినా, సాంకేతిక లోపాలు తలెత్తినా విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాము కోల్పోయిన విద్యుత్తును తిరిగి ఇవ్వడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం

వ్యవసాయానికి ఒకే విడతలో తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏడు గంటలు సరఫరా చేస్తున్నాం. అదనంగా మరో రెండు గంటలు కావాలని అన్నదాతల నుంచి వస్తున్న అభ్యర్థనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ఉన్నతస్థాయి నుంచి అనుమతి రాగానే 9 గంటలు ఇస్తాం. సరఫరాలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటాం.

రమణ, ఎస్‌ఈ, ఎస్పీడీసీఎల్, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని