logo

బద్వేలు... భూదందాలు!

గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా బద్వేలు నియోజకవర్గంలో భూదందాలు సాగాయి.

Published : 29 Jun 2024 03:23 IST

ఎక్కడా లేనంతగా ఆక్రమణలు
సిట్‌ ఏర్పాటు దిశగా సన్నాహాలు
గతంలో చంద్రబాబు, లోకేశ్‌ హామీ
కొత్త సర్కారుపైనే బాధితుల ఆశలు

బద్వేలు-పోరుమామిళ్ల మార్గంలో చదును చేసిన ప్రభుత్వ భూమి

బద్వేలు నియోజకవర్గంలో వైకాపా నేతలు భూదందాలు సాగించారు. ప్రభుత్వ భూములతోపాటు పేదలకు చెందినవీ కాజేశారు. వీటిపై తెదేపా అధికారంలోకి రాగానే విచారణ కమిటీ నియమించి ఆక్రమిత భూముల్ని వెనక్కి తీసుకుని బాధితులకు పంచి పెడతాం. భూఆక్రమణలకు వత్తాసు పలుకుతున్న అధికారులను వదిలిపెట్టం.  

బద్వేలులో గతేడాది ఏప్రిల్‌ 19న జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబునాయడు

బద్వేలు నియోజకవర్గంలో వైకాపా నేతల వారీగా భూదందాల వివరాలను ప్రకటించారు. ప్రభుత్వ భూములను భారీ ఎత్తున కాజేశారు. వీటన్నింటిపై విచారణ చేపట్టి వెనక్కి తీసుకుంటాం. నకిలీ పత్రాలను సృష్టించి ప్రైవేటు భూములను లాక్కున్నారు. వీటిపైనా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తాం.

గతేడాది జూన్‌ 12న బద్వేలు పాదయాత్ర సభలో నారా లోకేశ్‌ హామీ

ఈనాడు, కడప: గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా బద్వేలు నియోజకవర్గంలో భూదందాలు సాగాయి. వైకాపా నేతలు వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేశారు. పేదలకు చెందిన భూములు చాలావరకు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇందుకోసం నకిలీ పట్టాలు సృష్టించే ముఠా సైతం నియోజకవర్గంలో పట్టుబడింది. కేసును రాజకీయ నేతల అండదండలతో నిర్వీర్యం చేశారు. నకిలీ పట్టాల ఆధారంగా క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేయడం సాగించారు. వైకాపాకు చెందిన కీలక నేతలు, వారి పీఏలు దందా సాగించారు. రూ.కోట్ల విలువైన సంపదను వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి మండలంలోనూ భూ ఆక్రమణలు ఇష్టారాజ్యంగా సాగాయి. బద్వేలు, గోపవరం, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, అట్లూరు మండలాల్లో ప్రభుత్వ భూములను నేతలు కాజేశారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను ఆక్రమించుకున్న దాఖలాలున్నాయి. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, అక్రమంగా ప్రవేశించడం, వారికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలికారు. వందలాది మంది బాధితులు రోడ్డున పడ్డారు. నియోజకవర్గంలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్తగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటి కోసం చేపట్టిన భూసేకరణలోనూ అక్రమాలు జరిగాయి. ఒకరి స్థానంలో మరొకరికి పరిహారం అందజేశారు. ప్రభుత్వ భూములకు సైతం పరిహారం చెల్లించిన దాఖలాలున్నాయి. ఇలాంటి అక్రమాలు, ఆక్రమణల తరుణంలో ఎన్నికలు రావడం, వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోవడం, తెదేపా చేతికి అధికార పగ్గాలు రావడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. తమకు న్యాయం జరుగుతుందనే ధైర్యంతో ఉన్నారు. ఇదే తరుణంలో తెదేపా నియోజకవర్గ నేత రితీష్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వం కాస్త కుదుట పడిన వెంటనే సిట్‌ లేదా.. దాని సమాన స్థాయి విచారణ కమిటీని నియమించి దర్యాప్తు చేయిస్తామనే హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలో కార్యరూపం దాల్చేవిధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని