logo

వైకాపాతో అంటకాగిన ఆర్టీసీ అధికారులు

వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఆర్టీసీలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారు.

Published : 29 Jun 2024 03:17 IST

చిన్నచౌకు (కడప), న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఆర్టీసీలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారు. వీరికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారికి వేరే విధులు కేటాయించడం, బదిలీ చేయడం, కేసులు నమోదు చేయడం లాంటివి ఘటనలు చోటుచేసుకోగా, నేతల మద్దతు ఉంటే విధులకు వెళ్లకపోయినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కడప ఆర్టీసీ డిపోలో వైకాపా మద్దతుతో కండక్టరు స్థాయిలోని ఓ ఉద్యోగి డిపోను తన చేతుల్లో పెట్టుకున్నారు. చివరకు అధికారులు కూడా ఆయన చెప్పినట్లే వ్యవహరించిన దాఖలాలున్నాయి. ఎన్నికల సందర్భంగా ఏకంగా కొంతమంది రాష్ట్రస్థాయి ఉద్యోగులు కడప బస్టాండు, గ్యారేజీకి వచ్చి వైకాపాకు ఓట్లేయాలని ప్రచారం చేశారు. ఇందులో కడప డిపో అధికారులు, ఉద్యోగులు సైతం పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి చివరకు సస్పెన్షన్లకు గురయ్యారు. ఇలా ప్రచారం చేయడం తప్పు అని ఉన్నతాధికారులు వారిని వారించలేదు. కడప డిపోలో కొంత మంది చిన్నస్థాయి అధికారులు కూడా వైకాపాకు చెందిన సంఘం నాయకులు చెప్పినట్లు విని తమ పనులు కూడా చేయించుకున్నారు.  

ఆర్టీసీ ఆసుపత్రిలో అంతా ఆయన మనుషులే : వైకాపా అధికారంలోకి వచ్చాక కడపకు చెందిన ఓ నాయకుడు ఆర్టీసీలో రాష్ట్రస్థాయి పదవి పొందారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఆసుపత్రిలో ఎక్కువగా ఆయనకు కావాల్సిన వారే ఉద్యోగాలు పొందారు. అప్పటివరకు అక్కడ పనిచేస్తున్న వారిని ఏదో ఒక సాకు చూపించి బయటకు పంపించేశారు. ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ తన అనుచరులను వివిధ పోస్టుల్లో నియమించుకున్నారు. జిల్లా స్థాయి అధికారులకు తెలిసినా ఆయన చెప్పారని ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది సదరు నాయకుడి అనుచరులు, వైకాపాకు చెందిన వారే ఉన్నారు.  

ఆ సంఘానికి మాత్రమే అనుమతి : ఆర్టీసీ అధికారులు ఐదేళ్లలో కేవలం వైకాపా సంఘం నాయకులకు మాత్రమే తమ కార్యాలయాల్లోకి అనుమతించారు. వేరే సంఘాల వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. వారు చెప్పిన సమస్యలను కనీసం విన్న పాపాన పోలేదు. వైకాపా సంఘం నాయకులు చెప్పినట్లే కొంతమంది అధికారులు నడుచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని