logo

కన్నేశారు... కాజేశారు!

పీలేరులోని నూనె విత్తుల కర్మాగారం భూములను గత వైకాపా ప్రభుత్వ అండతో నేతలు కాజేశారు.

Published : 29 Jun 2024 03:11 IST

వైకాపా నాయకుల ఆక్రమణలో నూనె విత్తుల కర్మాగారం
రైతులిచ్చిన 55.19 ఎకరాల విలువ రూ.500 కోట్ల పైమాటే
న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ

పీలేరులోని నూనె విత్తుల కర్మాగారం ఆవరణలోనిర్మిస్తున్న ఆసుపత్రి భవనం

పీలేరులోని నూనె విత్తుల కర్మాగారం భూములను గత వైకాపా ప్రభుత్వ అండతో నేతలు కాజేశారు. భూముల చుట్టూ ఉన్న కంచె తొలగించి విచ్చలవిడిగా కబ్జాలకు తెరలేపారు. వీటిని కాపాడాల్సిన రెవెన్యూ శాఖాధికారులు అక్రమార్కులకు వంత పాడారు. ఆక్రమణదారులు వారు అడిగిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు పొజిషన్‌ ధ్రువపత్రాలు జారీ చేసి అక్రమాలకు కొమ్ముకాశారు. కర్మాగారంలోని గోదాములు తప్ప మిగతా భూములను ఆక్రమించేసి విలాసవంతమైన భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇలా ఆక్రమణకు గురైన భూముల విలువ రూ.500 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.

 కర్మాగారం ఆవరణలో అక్రమ భవన నిర్మాణాలు

రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం మంది రైతులు వేరుసెనగ సాగుచేస్తుంటారు. వీరు పండించిన పంటను దళారులకు వచ్చిన కాడికి అమ్ముకునేవారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలనే ఆలోచనతో 1987లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రభుత్వ హయాంలో పీలేరు-తిరుపతి మార్గంలో శ్రీకృష్ణ దేవరాయల పేరిట నూనె విత్తుల కర్మాగారం ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో మొత్తం 21 మంది రైతులు 55.19 ఎకరాల భూములివ్వడంతో పరిశ్రమ స్థాపించారు. అప్పట్లో పరిశ్రమ చుట్టూ కంచె ఏర్పాటు చేసి భూములకు రక్షణ కల్పించారు. అనంతరం పరిస్థితుల ప్రభావంతో సంస్థ మూతపడడంతో కర్మాగార భూములపై వైకాపా నేతల కన్ను పడింది. కర్మాగార భూముల్లో అక్రమ నిర్మాణాలను ఇటీవల పరిశీలించిన తెదపా ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ చేపట్టిన అక్రమ కట్టడాలను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవడం లేదా తమకే దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూములిచ్చిన రైతులు కోరుతున్నారు.

విచారణ జరుపుతున్నాం : పీలేరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ, డీకేటీ భూములు ఆక్రమణలకు గురయ్యాయనేదానిపై సర్వే చేస్తున్నాం. సర్వే పూర్తయిన అనంతరం జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. వారిచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

మహబూబ్‌బాషా, తహసీల్దారు, పీలేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని