logo

పేరుకే రైతులకు అవగాహన... అంతా జగన్‌ నామస్మరణ..!

జిల్లాలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్నట్లు సాగింది రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) నిర్వహణ.

Updated : 29 Jun 2024 04:55 IST

జిల్లాలో 396 ఆర్‌బీకేల్లో రూ.1.66 కోట్లతో టీవీల ఏర్పాటు
న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

 రాజంపేట మండలం మందరం రైతు భరోసా కేంద్రంలో నిరుపయోగంగా టీవీ

జిల్లాలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్నట్లు సాగింది రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) నిర్వహణ. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పంటల సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతోపాటు పంటలు కొనుగోలు చేసి నగదును నేరుగా రైతుల ఖాతాల్లో వేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైకాపా నాయకులు ఊదరగొట్టారు. దీనిలో భాగంగా రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రతి కేంద్రానికి టీవీ, పెన్‌డ్రైవ్, అంతర్జాల సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇవి ఒక్కరోజూ రైతులకు ఉపయోగ పడిన దాఖలాల్లేవు. జిల్లాలోని 396 రైతు భరోసా కేంద్రాల్లో రూ.42 వేల చొప్పున ఖర్చు చేసి 396 టీవీలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.1.66,32,000 వెచ్చించారు. అంతర్జాల సౌకర్యం నిమిత్తం ఒక్కో కేంద్రానికి రూ.1,470-రూ.1560 వంతున రూ.6,17,760 ఖర్చు చేశారు. ఇలా మొత్తం రూ.1,72,49,760 ఖర్చు చేసినా తమకెలాంటి ఉపయోగం లేదని రైతులు వాపోతున్నారు. వీటిని గ్రామ స్థాయిలో రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశామని వైకాపా నేతలు ప్రచారం చేసినా అప్పటి సీఎం జగన్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కేవలం జగన్‌ భజన కార్యక్రమాలకే భారీఎత్తున నిధులు ఖర్చు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీవీలు వినియోగంలోకి తెస్తాం : జిల్లా వ్యాప్తంగా 396 ఆర్‌బీకేల్లో టీవీలు సద్వినియోగం చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేవిధంగా ఏర్పాట్లు చేస్తాం. 

చంద్రనాయక్, డీఏవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని