logo

దాడులు.. దౌర్జన్యాలు.. దారుణ హత్యలు..!

రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలకు అడ్డాగా మారింది.

Published : 29 Jun 2024 03:05 IST

ప్రొద్దుటూరులో క్షీణించిన శాంతిభద్రతలు
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు నేరవార్తలు

వైఎంఆర్‌ కాలనీలో హత్యకు గురైన వెంకట మహేశ్వరరెడ్డి (పాత చిత్రం)

రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలకు అడ్డాగా మారింది. దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. తరచూ దాడులు, దౌర్జన్యాలతో పాటు వరుసగా దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత అయిదేళ్ల వైకాపా పాలనలో శాంతి భద్రతలు క్షీణించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగాయి. క్రికెట్‌ బెట్టింగ్, మట్కా, ఇసుక అక్రమ రవాణా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగాయి. పెన్నానది నుంచి నిత్యం అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. నేరాల కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల హత్యకు గురైన అర్షద్‌ (పాతచిత్రం)

  • 2024, జూన్‌ 7న ప్రొద్దుటూరు పట్టణం ఇస్లాంపురం వీధికి చెందిన ఓ యువకుడు తెదేపా నేతలతో తిరుగుతున్నాడని వైకాపా నాయకులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలు కాగా ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
  • 2024, జూన్‌ 15న ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డులో ఇసుక తరలింపు వ్యవహారంలో వైకాపా ముఖ్య నేత అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ ప్రాంతంలో తాము మాత్రమే ఇసుక తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునేది లేదంటూ కొందరి వ్యక్తులతో వాగ్వాదానికి దిగి దాడికి యత్నంచారు.
  • 2024, జూన్‌ 21న స్థానిక రామేశ్వరం రోడ్డులో దారుణ హత్య జరిగింది. దర్గాబజార్‌కు చెందిన అర్షద్‌ను పుల్లయ్యసత్రం వీధికి చెందిన వెంకటసుబ్బయ్య బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులను అర్షద్‌ తిట్టడంతో దాన్ని మనసులో పెట్టుకుని మద్యం తాగి పడిపోయి ఉన్న అర్షద్‌ను కొట్టి చంపేశాడు.
  • 2024, జూన్‌ 23న రాత్రి వైఎంఆర్‌ కాలనీలో మహేశ్వరరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పడుకున్న మహేశ్వరరెడ్డిని భూమిరెడ్డి రామచంద్రారెడ్డి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుగా చేసి రెండు సంచులో నింపి వాటిని ద్విచక్రవాహనంలో తీసుకెళ్లి పట్టణ శివారు ప్రాంతంలో పడేశాడు. ఇళ్లంతా రక్తపు మరకలు ఉండటంతో యువకుడి తల్లి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల వైకాపా నాయకుల దాడిలో గాయపడిన యువకుడు

నేరాల కట్టడికి చర్యలు

ప్రొద్దుటూరులో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేశాం. రౌడీషీట్లు తెరిచాం. ఇటీవల జరిగిన రెండు హత్య కేసుల్లో 24 గంటల్లోనే నిందితులను గుర్తించాం. నేరాల కట్టడి చేసేందుకు పలువురి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు.  

మురళీధర్, డీఎస్పీ, ప్రొద్దుటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని