logo

Ysrcp: డామిట్‌.. కథ అడ్డం తిరిగింది!.. తెరపైకి కడప వైకాపా నేత హత్య కేసు

గతేడాది కడప నగరంలో పట్టపగలు జరిగిన వైకాపా నేత శ్రీనివాసరెడ్డి హత్య కేసును తిరగతోడుతున్నారా?... సీఐడీ రంగంలోకి దిగిందా?

Updated : 26 Jun 2024 12:11 IST

బాధితురాలు ఫిర్యాదుతో సీఐడీ విచారణకు ఆదేశం
వైకాపా కీలక నేతలు, పోలీసు అధికారుల్లో ఆందోళన 

 శ్రీనివాసరెడ్డి మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య మౌనిక, పిల్లలు

ఈనాడు, కడప: గతేడాది కడప నగరంలో పట్టపగలు జరిగిన వైకాపా నేత శ్రీనివాసరెడ్డి హత్య కేసును తిరగతోడుతున్నారా?... సీఐడీ రంగంలోకి దిగిందా?... పునర్విచారణలో కేసు నుంచి తప్పించుకున్న వైకాపా కీలక నేతలతో పాటు వ్యవహారాన్ని తప్పుదారి పట్టించిన పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకోనుందా?... నిందితుల పాపం పండే రోజులు దగ్గరపడ్డాయా?... తాజా పరిస్థితులు బట్టి చూస్తే త్వరలోనే పెను సంచలనం కలగనుందనే సమాధానం లభిస్తోంది. 

వైకాపా నేత శ్రీనివాసరెడ్డిని సొంత పార్టీ వారే హత్య చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార అండతో ఘటనలో భాగస్వాములు తప్పించుకోగా, పోలీసులు ఇతరులపై కేసును మోపి చేతులు దులుపుకొన్నారు. గత ఐదేళ్లలో కడప, కమలాపురం నియోజకవర్గాల్లో వైకాపా కీలక నేతల భూదాహానికి పేదల స్థలాలు, ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. నలుగురు వైకాపా కీలక నేతల తరఫున దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు చేసే బాధ్యతలను వైకాపా నాయకుడు శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. అనతికాలంలో రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టిన అనంతరం వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో శ్రీనివాసరెడ్డిని వైకాపా కీలక నేతల అనుచరులు కడప నగరంలో పట్టపగలు కత్తులతో నరికి చంపారు. కేసులో అసలు కుట్రదారులు, సూత్రదారులను పోలీసులు తప్పించారని శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం మారిన అనంతరం ఆమె డీజీపీని ఆశ్రయించగా, కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హత్య కేసులో అసలు కట్రదారులు.. సహకరించిన పోలీసుల బండారం వెలుగులోకి రానుంది. 

 

హత్యకు గురైన శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక 

  • కడప నగరంలోని సంధ్యా కూడలిలో గతేడాది జూన్‌ 23న ఉదయం వ్యాయామశాల నుంచి బయటకొస్తున్న వైకాపా నాయకుడు శ్రీనివాసరెడ్డిని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నడిరోడ్డుపై నరికి చంపారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడప, కమలాపురం నియోజకవర్గాల్లో నలుగురు వైకాపా కీలక నేతలు ఇష్టారాజ్యంగా భూదందాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడ్డారు. వీరి కనుసన్నల్లోనే  శ్రీనివాసరెడ్డి రెండు నియోజకవర్గాల్లో సెటిల్‌మెంట్ల చేయడం ద్వారా రూ.కోట్లు సంపాదించారు. వాటాల్లో వచ్చిన తేడాలతో శ్రీనివాసరెడ్డి కింద పనిచేసే ప్రతాప్‌రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.  కేసులో ప్రతాప్‌రెడ్డితోపాటు శ్రీనివాసులు, సురేశ్‌కుమార్, హరిబాబు, వెంకటసుబ్బయ్య, రాణి, సుబ్బారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఆర్థికంగా సాయం చేసిన, ఓ పెట్రోలు బంకులో కుట్ర పన్నిన అసలు నిందితులను పోలీసులు వదిలేశారు. నిందితులపై హతుడి భార్య మౌనిక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. గుంటి నాగేంద్ర, విశ్వనాథరెడ్డి, జమీల్, పెట్రోల్‌ బంకు యజమాని రామ్మోహన్‌రెడ్డిపై అనుమానం ఉందంటూ మౌనిక ఫిర్యాదు చేశారు. కేసు విషయంలో పోలీసులు భారీగానే ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతోనే అసలు కుట్రదారులను అరెస్టు చేయకుండా వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

హతుడి కుటుంబానికి అన్యాయం

హత్యలో నలుగురు అనుమానితుల పేర్లు బయటకు రాకుండా నలుగురు వైకాపా కీలక నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ నలుగురు భూదందాలతోనే శ్రీనివాసరెడ్డి బలయ్యాడని కడప నగరంలో కరపత్రాలు కూడా వెలిశాయి. అలాంటి సమయంలో మౌనికను ఆదుకోవాల్సిన ఆ నేతలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె కడప, కమలాపురానికి చెందిన తెదేపా నేతల సహకారంతో డీజీపీని కలిశారు. తన భర్త హత్య కేసులో అసలు సూత్రధారులు, కుట్రదారుల వివరాలు, పోలీసుల వ్యవహారశైలిని డీజీపీకి వివరించారు. దీంతో కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల కిందట తిరుపతి నుంచి సీఐడీ డీఎస్పీ పద్మలత బృందం మౌనికను కలిసి వివరాలు సేకరించింది. ఘటనాస్థలాన్ని సందర్శించింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభంకానుండడంతో వైకాపా నేతల్లో గుబులు మొదలైంది. హత్యకేసు నుంచి తప్పించుకున్న అనుమానితులు, తప్పించిన పోలీసుల బండారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన జిల్లాలో నెలకొంది.   

డీజీపీ కార్యాలయ తలుపు తట్టిన మౌనిక

వైకాపా ప్రభుత్వంలో న్యాయం కోసం హతుడి భార్య మౌనిక పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. చివరకు ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వాన్ని, కొత్త డీజీపీని ఆశ్రయించారు. ‘గత ప్రభుత్వంలో డీజీపీ వద్దకు వెళ్లగా ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇటీవల డీజీపీని కలవగా వెంటనే సీఐడీకి అప్పగించారు. కేసు విచారణలో పలువురు నిందితులు తేలినా కొందరిని వదిలిపెట్టారు.  నాగేంద్ర, రామ్మోహన్‌రెడ్డి హస్తం ఉన్నట్లు తేలినా రాజకీయ హస్తం ఉన్నందున అరెస్టు చేయలేదు. నా భర్త వైకాపాలో ఉన్నా న్యాయం చేయలేదు. పిల్లలు.. నేను ఎంతో క్షోభతో ఉన్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారినందున న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను’ అని మౌనిక తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు