logo

వైకాపా అండతో కొలువులాట

వైకాపా పాలనలో భీమవరం పురపాలక  సంఘం అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో యథేచ్ఛగా అక్రమ నియామకాలు జరిగిపోయాయి.

Updated : 05 Jul 2024 06:17 IST

ఆ పార్టీ నేత చెప్పిన వారికి ఉద్యోగాలు
విధులకు రాకుండా వ్యాపారాలు చేస్తున్నా జీతాలు
బినామీలతో కథ నడిపిస్తున్న వైనం

  • భీమవరానికి చెందిన వైకాపా నేతకు 2014 నుంచి ఓ యువకుడు పీఏగా పని చేస్తున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే ఆ నేత సిఫార్సుతో ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా అక్రమంగా ఉద్యోగం ఇప్పించారు. గత అయిదేళ్లుగా ఒక్క రోజు కూడా అతను విధులు నిర్వహించలేదు. అధికారులు హాజరు వేసేశారు. అతను యథేచ్ఛగా ఆ నేత సేవలోనే తరిస్తున్నారు. నెలకు రూ.23 వేలు చొప్పున గత అయిదేళ్లలో రూ.13.8 లక్షల ప్రభుత్వ సొమ్మును జీతం రూపంలో దోపిడీ చేశారు.
  • ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసే ఓ ఉద్యోగికి డ్రైవర్‌గా పదోన్నతి వచ్చింది. కార్మికుడి జీతం కంటే డ్రైవర్‌కు రూ.13 వేల జీతం అదనంగా వస్తుంది. విధుల భారం నుంచి తప్పించుకునేందుకు వైకాపా స్థానిక నేతతో సిఫార్సు చేయించుకుని అక్రమంగా పారిశుద్ధ్య మేస్త్రీగా విధులు నిర్వహిస్తున్నారు. గత అయిదేళ్లు ఇదే వ్యవహారం చేశారు. దీంతో పురపాలికకు నెలకు రూ.13 వేల చొప్పున అయిదేళ్లకు దాదాపు రూ.8 లక్షలు జీతం రూపంలో దోచేశారు. 
  • భీమవరం రెండో పట్టణంలో ట్యాంకు వాచ్‌మెన్‌గా పని చేసే ఓ ఉద్యోగి రూ.80 వేలు జీతం తీసుకుంటున్నారు. గత అయిదేళ్లలో ఒక్క రోజు కూడా విధులకు రాలేదు. బినామీ వర్కర్‌ను పెట్టి ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. నామినేటెడ్‌ పోస్ట్‌లో ఉన్న ఓ వైకాపా నేత అండ ఉండటంతో అధికారులు సైతం ఠంచనుగా జీతం జమ చేసేస్తున్నారు. ఇతని వల్ల కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 

ఈనాడు, ఏలూరు: వైకాపా పాలనలో భీమవరం పురపాలక  సంఘం అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో యథేచ్ఛగా అక్రమ నియామకాలు జరిగిపోయాయి. అర్హత లేకుండానే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. వీరు పురపాలికలో వేలకు వేలు జీతాలు తీసుకుంటూ సొంత వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటున్నారు. వీరు విధులకు రానందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ అక్రమాలను పెంచి పోషించారు. 

అంతా వారిష్టం

భీమవరం పురపాలికలో గత అయిదేళ్లు వైకాపా అండతో అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరించారు. ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక ఇలా విభాగాలతో సంబంధం లేకుండా అడ్డగోలు నియామకాలు చేయడం..బినామీ కార్మికులతో పని చేయించటం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వైకాపా నేతలు కీలకంగా వ్యవహరించారు. అధికారం ఉంది కదా అని వారికి అనుకూలమైన వారందరికీ పొరుగు సేవల విభాగంలో ఉద్యోగాలిప్పించారు. ఇలా కొలువుల్లో చేరిన వారు సైతం విధులు నిర్వర్తించిన దాఖలాలు లేవు. మరికొందరైతే విధులకు రాకుండా ఇతర జిల్లాలకు వెళ్లిపోయినా జీతాలు తీసుకుంటున్నారు. నెలకు రూ.10 వేలు ఇచ్చి బినామీలను పెట్టి కథ నడిపించారు. ఇలా అక్రమంగా ఉద్యోగాలు పొందిన..బినామీలతో పని చేయించే వారు 40 మందికి పైగా ఉన్నారు. గత అయిదేళ్లలో రూ.కోట్ల పురపాలిక ఆదాయానికి గండి కొట్టేశారు.

  • పురపాలికలో అటెండర్‌ విధుల్లో ఉండాల్సిన ఓ ఉద్యోగి వైకాపా నేత స్నేహితుడికి సన్నిహితుడు కావటంతో అక్రమంగా ట్యాంక్‌ వాచ్‌మెన్‌ విధుల్లోకి మారారు. అతనికి నెలకు రూ.80 వేలకు పైగా జీతం. ట్యాంకు దగ్గర విధులు నిర్వహించాల్సి ఉండగా ఆ బాధ్యతలు ఓ బినామీకి అప్పగించారు. కనీసం స్థానికంగా కూడా అందుబాటులో ఉండకుండా విశాఖలో స్థిరాస్తి, వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా వైకాపా నేత ఆశీస్సులు ఉండటంతో అధికారులు పట్టించుకోలేదు. దీంతో జీతం రూపంలో గత అయిదేళ్లుగా రూ.48 లక్షలు దోపిడీ చేశారు.

అధికార పార్టీ చెప్పిందే వేదం

పశ్చిమ జిల్లా కేంద్రం భీమవరం పురపాలికలోని వివిధ విభాగాల్లో బినామీలు పని చేయడం, కొందరు అసలు విధుల్లో లేకపోవటంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. ఉద్యోగులు విధులకు రాకపోవటంతో పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వైకాపా నాయకులు చెప్పిందే వేదంగా అధికారులు వ్యవహరించారు. అడ్డగోలుగా ఉద్యోగాలివ్వడమే కాకుండా వారు విధులకు రాకున్నా కనీస చర్యలు తీసుకోలేదు. ఏళ్ల తరబడి రాకున్నా..బినామీలు పని చేస్తున్నా పట్టించుకోలేదంటే వైకాపా నేతలు ఏ స్థాయిలో అధికార దర్పం ప్రదర్శించారో తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని