logo

ఆసుపత్రుల నిధులనూ వదల్లేదు!

భీమవరంలో ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ ఇలా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా కేంద్రం ద్వారా కాయకల్ప నిధులు విడుదలవుతాయి.

Published : 05 Jul 2024 04:58 IST

అడ్డగోలుగా మళ్లించిన వైకాపా సర్కారు

భీమవరం పట్టణం, కైకలూరు, చింతలపూడి, న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులనూ వైకాపా సర్కారు వదల్లేదు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కేటాయించిన సొమ్మును అడ్డగోలుగా ఇతర అవసరాలకు మళ్లించింది. అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చకుండా, వసతులు కల్పించకుండా ఆసుపత్రులను గుల్ల చేసింది.

భీమవరంలో ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ ఇలా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా కేంద్రం ద్వారా కాయకల్ప నిధులు విడుదలవుతాయి. కొన్నేళ్లుగా ఈ నిధులు మళ్లించడంతో పారిశుద్ధ్య నిర్వహణ కొండెక్కింది. ఆసుపత్రికి వెళ్తే అదనపు రోగం అంటుకునేలా ఆవరణ తయారైంది.

బాలింతలు శిశువులతో ఆసుపత్రులకు వచ్చినప్పుడు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. దీని కోసం గతంలో గదులు నిర్మించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వాటిని సద్వినియోగంచేసే నిధులు లేక చాలా చోట్ల ఇలా నిరుపయోగంగా మిగిలాయి.

లెక్కాపత్రం లేదు.. ఎన్‌క్వాస్‌ (నేషనల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ స్టాండర్డ్‌), లక్ష్య, ముస్కాన్, కాయకల్ప నిధులను కేంద్ర ప్రభుత్వం ఏటా ఆసుపత్రులకు విడుదల చేస్తుంది. వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు, రోగులను తరలించే చక్రాల కుర్చీలు, ట్రాలీల కొనుగోలుకు ఆసుపత్రి స్థాయిని బట్టి ఏటా రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఎన్‌క్వాస్‌ నిధులు విడుదలవుతాయి. ఆపరేషన్‌ థియేటర్, లేబర్‌వార్డుల్లో వసతులు, పరికరాలను సమకూర్చేందుకు ‘లక్ష్య’ నిధులు రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విడుదలవుతాయి. గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమయ్యే వసతులకు ‘ముస్కాన్‌’ ద్వారా రూ. 3.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వస్తాయి. వీటితో నవజాత శిశువులకు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయొచ్చు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణకు కాయకల్ప నిధులు రూ.5 లక్షలకు పైగా వస్తాయి. ఒక్కో పడకకు రూ.10 వేలుచొప్పున ఆయా ఆసుపత్రులకు నిధులు విడుదలవుతాయి. ఇలాంటి నిధులన్నింటినీ ఆసుపత్రి గుమ్మం చేరకుండానే వైకాపా ప్రభుత్వం మళ్లించేసింది.
2019 నుంచి.. ఉమ్మడి పశ్చిమగోదావరిలో తణుకు, ఏలూరులలో జిల్లా ఆసుపత్రులున్నాయి. తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, నరసాపురంలలో ప్రాంతీయ, ఆకివీడు, పెనుగొండ, ఆచంట, భీమడోలు, పోలవరం, దెందులూరు, చింతలపూడి, కైకలూరులలో సామాజిక ఆసుపత్రులున్నాయి. వీటిని కేంద్ర బృందాలు ఏటా తనిఖీ చేస్తాయి. 2019 నుంచి గతేడాది వరకు ఆయా ఆసుపత్రులకు కేంద్రం నుంచి విడుదలైన మొత్తంతో పాటు జేఎస్‌ఎస్‌కే, ఆసుపత్రి అభివృద్ధి నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించారు. ఈ నిధులను ఎలాంటి అవసరాలకు మళ్లించారో కూడా ఎలాంటి లెక్కాపత్రం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని ఆసుపత్రులకు గతంలో విడుదల కావాల్సిన నిధుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీసీహెచ్‌ఎస్‌ పి.సూర్యనారాయణ చెప్పారు. 

  • చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2022లో ఎన్‌క్యూఎస్‌ గుర్తింపు పొందినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.3 లక్షల చొఫ్పున కేటాయించాల్సి ఉన్నా ముందడుగు పడలేదు. ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు ఆసుపత్రి వెనుక భారీ గొయ్యి కూడా ఏర్పడింది. నిధుల లేమితో అభివృద్ధి పనులు సాగడం లేదు.

సొంత ఖర్చులతో..

ఏటా కేంద్ర బృందాలు ఆసుపత్రులను తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగానే నిధులు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో తనిఖీల సమయంలో ఆసుపత్రులను శుభ్రంగా తీర్చిదిద్దడం, ఇతర ఏర్పాట్లకు వైద్యాధికారులు సొంత నిధులు వెచ్చించేవారు. తరువాత నిధులు ఖాతాల్లో పడగానే రాష్ట్ర ప్రభుత్వం మళ్లించేయడంతో ఆసుపత్రులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

  • కైకలూరు సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించి రోగుల అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో శానిటైజేషన్, రోగులకు అందిస్తున్న సేవల విభాగంలో ఉత్తమ అవార్డు అందించారు. అభివృద్ధి నిధులను వైకాపా సర్కారు ఇప్పటి వరకు జమ చేయలేదు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని