logo

కేటాయింపులే.. విడుదల్లేవ్‌!

 జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనులు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Published : 05 Jul 2024 04:54 IST

పనులు నిలిపేసిన గుత్తే‘దారులు’
వెంటాడుతున్న గత  వైకాపా సర్కారు వైఫల్యాలు 

తణుకు, న్యూస్‌టుడే: జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనులు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. 
రహదారుల నిర్మాణానికి గత వైకాపా ప్రభుత్వం రూ. 87.5 కోట్లు మంజూరు చేసింది. 30 శాతం పనులు పూర్తి చేసిన గుత్తేదారులు..అనంతరం బిల్లులు విడుదల కాకపోవడంతో పనులను నిలిపేశారు. కొన్ని ఆర్‌అండ్‌బీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణతో పాటు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు 2021లో పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.

‘‘కానూరు- లంకలకోడేరు, పెనుమంట్ర- వీరవాసరం రహదారి పనులు పూర్తి చేశాం. మిగిలినవి  30 శాతం మేర పూర్తయ్యాయి. బిల్లులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు.’’ అని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు లోకేశ్వరరావు అన్నారు. 

కె.సముద్రగట్టు వద్ద గోతులుపై ప్రయాణికుల అవస్థలు 

ఎక్కడెక్కడ అంటే..

  • కానూరు - లంకలకోడేరు రోడ్డును గోటేరు నుంచి ఇరగవరం వరకు రూ.4కోట్లతో 2 కి.మీ మేర నిర్మించారు. దీనిలో భాగంగా కొంత దూరం సీసీ రోడ్డు వేశారు. 90 శాతం పనులు పూర్తయినా నిధులు మంజూరు కాలేదు. 
  • పెనుమంట్ర-నవుడూరు రహదారిని 600 మీటర్ల మేర రూ.1.4కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు.  
  • పెనుమంట్ర- వీరవాసరం, పాలకొల్లు- ఆచంట, మేడపాడు- నరసాపురం, తణుకు- భీమవరం,  తణుకు-ఇరగవరం మార్గాల్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పనులు 30 శాతం పూర్తయాయి.  గవర్లపాలెం నుంచి మోగల్లు వరకు 14.5 కి.మీ మేర నిర్మాణానికి రూ. 33 కోట్లు మంజూరు చేశారు. 1600 మీటర్ల మేర 5 మీటర్ల వెడల్పున ఉన్న రహదారిని 7 మీటర్ల వరకు విస్తరించి సిమెంట్‌ రహదారి నిర్మించారు. ప్రస్తుతం జేసీబీలతో తవ్వి రహదారిని చదును చేసి వదిలేశారు.
  • పాలకొల్లు నుంచి ఆచంట వరకు రూ.5.5 కోట్లతో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మేడపాడు నుంచి నరసాపురం వరకు రెండు బిట్లుగా చేయడానికి  రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ విడుదల కాకపోవడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి.  
  • తణుకు నుంచి భీమవరం వెళ్లే మార్గం ఇది. ఇరగవరం మండలం గవర్లపాలెం నుంచి అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇవి అసంపూర్తిగా వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని