logo

అంతా నా ఇష్టం!

నగరంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు రాన్రాను సన్నగిల్లుతున్నాయి. గతంలో జిల్లా కేంద్రం ఆసుపత్రిగా ఉత్తమ సేవలతో వెలుగొందగా...

Updated : 05 Jul 2024 06:19 IST

వివాదాస్పదంగా  సర్వజన ఆసుపత్రి ఉన్నతాధికారిణి వ్యవహారం
ఇష్టానుసారంగా సీనియర్‌ వైద్యుల బదిలీ
జోక్యం చేసుకొని ప్రక్రియ ఆపేసిన డీఎంఏ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: నగరంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు రాన్రాను సన్నగిల్లుతున్నాయి. గతంలో జిల్లా కేంద్రం ఆసుపత్రిగా ఉత్తమ సేవలతో వెలుగొందగా... నేడు విమర్శలు ఎదుర్కొంటోంది. ఆసుపత్రి పర్యవేక్షకురాలి ఒంటెద్దు పోకడలతో పలువురు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్పులు చేర్పులతో రోగులకూ అవస్థలు తప్పడం లేదు. తాజాగా ఆసుపత్రిలో కీలక సేవలందిస్తున్న అయిదుగురు స్పెషలిస్టు వైద్యులను సాగనంపే ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. విషయం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి చేరడంతో... ఆ ప్రయత్నం విరమించారు. ఆసుపత్రిలోని రోగులను రిఫర్‌ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారని... వైద్య సేవలందించడంలో దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి.

జగన్‌ ప్రత్యేకంగా పంపారని...

ఆసుపత్రి పర్యవేక్షకురాలిగా ఏడాదిన్నర కిందట బాధ్యతలు స్వీకరించారు. వైద్యశాలలో ప్రక్షాళన చేయడానికి, ఉత్తమ వైద్య సేవలందించడానికి నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా తనను నియమించారని ఆమె చెప్పుకొనేవారు. కానీ, వైద్య సేవల విషయంలో మాత్రం ఆ స్థాయి కనిపించలేదు. ఆసుపత్రి వైద్య కళాశాలగా స్థాయి పెరిగాక, ఇక్కడ పని చేసిన వైద్యులను బదిలీలు చేశారు. వారి స్థానంలో ఆచార్యులు, సహాచార్యులు రోగులకు వైద్యం చేసేవారు. ఇదిలా ఉండగా... జనరల్‌ ఫిజిషియన్‌గా సేవలందిస్తున్న సీనియర్‌ వైద్యుడు పోతుమూడి శ్రీనివాసరావు, కంటి వైద్య నిపుణుడు ఏఎస్‌ రామ్, న్యూరాలజీ వైద్య నిపుణుడు రవికుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు పీఏఆర్‌ఎస్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ గైనకాలజిస్టు లిటోర్నాదేవిలను అప్పట్లో వేరే ఆసుపత్రులకు బదిలీ చేశారు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులను ఇతర ప్రాంతాలకు పంపడంపై పలువురు అసంతృప్తి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయిదుగురు  వైద్యులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని... ఇక్కడే కొనసాగించాలని అప్పటి కలెక్టర్‌ ఆదేశించారు. తాజాగా వీరి డిప్యుటేషన్లను రద్దు చేసి ఆయా స్థానాలకు పంపాలని పర్యవేక్షకురాలు నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల కిందట రిలీవ్‌ ఆర్డర్లు కూడా ఇచ్చారు. మరోమారు డీఎంఏ జోక్యం చేసుకుని వైద్యుల బదిలీలను నిలిపివేశారు.

ఓపీ విభాగం నుంచి సిటీ స్కాన్‌ వైపు వెళ్లే రోడ్డులో బారికేడ్లు 

బారికేడ్లు అడ్డు పెట్టి...

గతంలో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రోడ్లకు అడ్డుగా ఎక్కడా బారికేడ్లు పెట్టిన దాఖలాల్లేవు. ప్రస్తుత పర్యవేక్షకురాలు మాత్రం ఏకంగా నాలుగు చోట్ల పెట్టించడం వివాదాస్పదమైంది. ఫలితంగా ఎటు రావాలి... ఎటు పోవాలో తెలియక రోగులు, వారి సహాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లాలంటే ప్రధానంగా ఆర్‌ఆర్‌పేట ఓ వైపు ద్వారం, కోర్టు రోడ్డులో మరో ద్వారం ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం రెడ్‌క్రాస్‌ కార్యాలయం వద్ద, సిటీ స్కాన్‌ సెంటర్‌కు వెళ్లే దారిలో మరో రెండు చోట్ల బారికేడ్లు రోడ్లకు అడ్డుగా పెట్టారు. ఫలితంగా అత్యవసర విభాగం నుంచి ఓపీ వైపు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఇలా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడంతో ఆసుపత్రికొచ్చేందుకు రోగులు వెనకడుగు వేస్తున్నారు. అధికారులు స్పందించి బారికేడ్లు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని