logo

అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం యావత్తు జాతికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రైతు నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు.

Published : 05 Jul 2024 04:42 IST

సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు 

భీమవరం పట్టణం, పాలకోడేరు, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం యావత్తు జాతికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రైతు నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్థానిక ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని కాంస్య విగ్రహానికి గురువారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ... సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అల్లూరితో సత్సంబంధాలున్న ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి, మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ... అల్లూరి జీవితం విద్యార్థులకు ఆదర్శనీయమన్నారు. అల్లూరి స్ఫూర్తితో తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.బలరాం, మంతెన సీతారాం, కూనపరాజు కుమార్, గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు.. అల్లూరి జయంతిని పురస్కరించుకొని నిర్వహణ కమిటీ ఆధ్వర్యాన ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, అత్తిలి, పోడూరు మండలాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శనగా మోగల్లు చేరుకున్నారు. అక్కడ సీతారామరాజు విగ్రహనికి పుష్పాంజలి ఘటించారు. అక్కణ్నుంచి భీమవరంలోని అల్లూరి స్మృతివనం వద్ద ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని... ప్రాణాలు కోల్పోయిన అల్లూరి సీతారామరాజు యువతరానికి స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో అల్లూరి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ పుష్పాంజలి ఘటించారు. మన్యం వీరుడు అల్లూరి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, డీఆర్వో ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని