logo

కేవీకే వాకిట.. స్వర్ణోత్సవం

దేశంలో వ్యవసాయ రంగం, రైతులను బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Published : 05 Jul 2024 04:41 IST

స్వర్ణోత్సవ జ్యోతిని అందుకుంటున్న విస్తరణ సంచాలకురాలు కరుణ శ్రీ

తాడేపల్లిగూడెం పట్టణం (ఉద్యాన విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: దేశంలో వ్యవసాయ రంగం, రైతులను బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి, 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో స్వర్ణోత్సవం నిర్వహిస్తున్నారు. దేశంలో మొట్టమొదటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని 1974 మార్చి 21న పుదుచ్చేరిలో  ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 731 కేవీకేలు ఏర్పాటయ్యాయి. స్వర్ణోత్సవాల్లో భాగంగా స్వర్ణోత్సవ జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పందిరిమామిడి కేవీకే నుంచి స్వర్ణోత్సవ జ్యోతి గురువారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంది. ఈ నెల 5,6 తేదీల్లో కేవీకేలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విస్తరణ సంచాలకురాలు ఇ.కరుణ శ్రీ తెలిపారు. వెంకట్రామన్నగూడెం కేవీకే 14 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 

అన్నదాతలకు ఊతం.. వెంకట్రామన్నగూడెం వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 2010లో ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వరంగా మారింది. సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించడానికి  సహకరిస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతోంది. ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను అన్నదాతలకు చేరువ చేస్తోంది. 

కేవీకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్‌ 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విలక్షణ కార్యక్రమాలు, వినూత్న సేవలతో కేవీకే కర్షకుల మన్నన పొందుతోంది. ఉద్యానం, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, తేనెటీగలు, నర్సరీ మొక్కలు, పెరటి తోటల పెంపకం, చేపల పెంపకంలో రైతులకు సలహాలు, సూచనలిస్తోంది. కమ్యూనిటీ రేడియో స్టేషన్, యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కూడా సేవలందిస్తోంది. నూతన సాంకేతిక పద్ధతులు, మేలైన యాజమాన్యంతో రైతులు  సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ మేరకు  జాతీయ, జోనల్‌ స్థాయిలో పలు పురస్కారాలను దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని