logo

ఆందోళనొద్దు.. ఆదుకుంటాం

నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు మార్కెట్‌ యార్డులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు.

Published : 05 Jul 2024 04:38 IST

నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపునకు కృషి 
రైతులకు మంత్రి పార్థసారథి భరోసా

మాట్లాడుతున్న కొలుసు 

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు మార్కెట్‌ యార్డులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయి మార్కెట్‌ నూజివీడు మామిడికి ఉందని, దాని స్థాయి మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో మామిడికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి ప్రభుత్వపరంగా రైతులకు లబ్ధి చేకూరుస్తామన్నారు. ఎగుమతుల ద్వారా రైతులు లాభం పొందేలా ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. బీమా సమస్యను పరిష్కరిస్తామన్నారు. మామిడి పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, క్షేత్రస్థాయిలో ఫలితాలు రైతులకు అందినప్పుడే శాస్త్రవేత్తల పరిశోధనకు సార్థకత చేకూరుతుందన్నారు. పంట సాగులో మెలకువలపై యువ రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. కాయకు తొడిగే కవర్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మామిడి సాగు సమస్యలు వివరించి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకుంటామన్నారు. పలువురు రైతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యాన శాఖ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానాధికారి ఎస్‌.రామ్మోహన్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు అధికారి పి.రవికుమార్, శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్‌రావు, నూజివీడు ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కాపా శ్రీనివాసరావు, గొల్లపూడి ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ నూతక్కి రామప్రసాద్, పారిశ్రామికవేత్త కోటగిరి శ్రీనివాస్, విజయబాబు, మామిడి రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని