logo

ఏళ్లుగా అరణ్యరోదనగానే..

పట్టాలిచ్చి ఏళ్లు గడిచిపోతున్నాయి..కాని తమ భూములకు హద్దులు చూపడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 05 Jul 2024 04:36 IST

హద్దులు చూపాలంటూ లబ్ధిదారుల డిమాండ్‌

అల్లంచర్లరాజుపాలెంలో పేదలకు పంపిణీ చేసిన భూమి

టి.నరసాపురం, న్యూస్‌టుడే: పట్టాలిచ్చి ఏళ్లు గడిచిపోతున్నాయి..కాని తమ భూములకు హద్దులు చూపడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెంలో ప్రభుత్వ భూమి సర్వే నం.70లోని 120 ఎకరాల్లో 80 ఎకరాలను పేదలకు, మరొక 40 ఎకరాలను విత్తనాభివృద్ధి క్షేత్రానికి 2005లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 80 ఎకరాల భూమిని 160 మంది పేదలకు (50 సెంట్లు చొప్పున) పంపిణీ చేసి పట్టాలు కూడా ఇచ్చింది. సాగు కోసం మూడు బోర్లు కూడా వేసింది. నాటి నుంచి అధికారులు ఆయా భూములకు సబ్‌డివిజన్‌ చేయలేదు. లబ్ధిదారులకు సరిహద్దులు చూపలేదు. అనంతరం వాటిలో కొందరు పేదలు అనుకూలమైన పంటల సాగు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో భూముల్లోకి వెళ్లేందుకు దారులు లేకపోవడంతో 2014లో 50 సెంట్లను 40 సెంట్లకు కుదించి మళ్లీ పట్టాలిచ్చారు. కొందరికి ఆన్‌లైన్‌ కూడా చేశారు. ప్రభుత్వ పథకాలు(రైతు భరోసా, పీఎం కిసాన్‌) సైతం అందుతున్నాయి. కానీ భూములు ఎక్కడున్నాయో లబ్ధిదారులకు చూపించలేదు. 

తమ భూములు చూపాలంటూ కోరుతున్న లబ్ధిదారులు 

వారు ఎలా కొన్నారు

లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమికి ఇంకా హద్దులు చూపలేదు. ఇతర గ్రామాలకు చెందిన వారు ఒక్కొక్కరు 4 ఎకరాలు 80 సెంట్లు చొప్పున కొనుగోలు చేసి ఆయిల్‌పాం తోటలు పెంచడం విచారకరం.’ అని అల్లంచర్లరాజుపాలెం సర్పంచి నార్ని వెంకట్రావు అన్నారు. 

ఎదురు చూస్తూనే ఉన్నా 

‘గతంలో కొద్దిపాటి భూమిలో నేను జీడితోట పెంచుకున్నా. ప్రభుత్వం దాన్ని తొలగించి 40 సెంట్ల భూమికి పట్టా ఇచ్చింది. దానికి రైతు భరోసా పథకం కూడా వర్తిస్తోంది. 18 ఏళ్లుగా నా భూమి ఎక్కడుందో నాకు చూపుతారని ఎదురు చూస్తూనే ఉన్నా’ అని  అల్లంచర్లరాజుపాలెంకు చెందిన ఉప్పులూరి చిట్టెమ్మ తెలిపారు. 

విచారణ నిర్వహిస్తాం 

‘అల్లంచర్లరాజుపాలెంలో పేదలకు పంపిణీ చేసిన భూములకు సంబంధించి విచారణ నిర్వహించి చర్యలు చేపడతాం’ అని జంగారెడ్డిగూడెం ఆర్డీవో అద్దయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని