logo

పట్టిసీమ పరవళ్లు

కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది.

Published : 04 Jul 2024 05:31 IST

కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి విడుదల 

ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే-పోలవరం, జంగారెడ్డిగూడెం పట్టణం : కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. వైకాపా విచ్ఛిన్నం చేసిన ఎత్తిపోతల పథకాలను నెత్తిన పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా నింపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోగా వరద నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టి పట్టిసీమ ద్వారా రైతు అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పదిలక్షల ఎకరాలకు ఆయువు పట్టులా ఉండే పథకాన్ని వైకాపా గాలికొదిలేసిందని విమర్శించారు. 

పూజలు చేస్తున్న మంత్రి రామానాయుడు, చిత్రంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బాలరాజు తదితరులు 

కార్యక్రమం సాగిందిలా.. ఉదయం 7 గంటలకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్న మంత్రి నిమ్మల అధికారులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల వేదాశ్వీరాదం అనంతరం 7.27 గంటలకు ఎత్తిపోతలకు సంబంధించిన మూడు మోటార్ల మీట నొక్కి నీటిని విడుదల చేశారు. ఒక్కో మోటార్‌ నుంచి 350 క్యూసెక్కుల చొప్పున 1050 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అక్కడి నుంచి ఎత్తిపోతల నీరు కుడికాలువ ద్వారా ప్రవహించే విధానాన్ని చూసే నమూనా ప్రదర్శనను చూసి అధికారుల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకున్నారు. నీటి డిశ్ఛార్జ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. నీరు కుడి కాలువలోకి చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని ఎత్తిపోతల పథకాల్లో నీరు విడుదల చేసేందుకు వెళ్లారు. 

అన్నదాతల్లో ఆశల చిగురింత..

వైకాపా ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల నిర్వహణ విస్మరించడంతో కృష్ణా డెల్టాలోని శివారు ప్రాంతాలకు నీరు చేరటం అసాధ్యమైంది. దీంతో పొలాలు నెర్రెలు తీసి రైతులను కష్టాల్లో ముంచాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఎత్తిపోతల పథకాలకు పూర్వ వైభవం వస్తుందని అన్నదాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకు తగట్టుగానే వరద నీరు వచ్చిన వెంటనే పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలించారు. పట్టిసీమ ఎత్తిపోతలకు మొత్తం 24 పంపులు ఉండగా..బుధవారం నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. క్రమంగా గోదావరిలోకి వచ్చి చేరే వరద నీటి సామర్థ్యాన్ని బట్టి కృష్ణాడెల్టా అవసరాలకు అనుగుణంగా మిగిలిన పంపుల ద్వారా 8500 క్యూసెక్కులు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల, సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నీటి ద్వారా కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. గోదావరి పరవళ్లతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మళ్లీ మంచిరోజులొచ్చాయంటూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఐటీడీఏ పీవో సూర్యతేజ, జలవనరుల శాఖ అధికారులు, తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని