logo

చెరువు.. కనుమరుగు!

తణుకు పురపాలక సంఘ పరిధిలో మత్స్యశాఖ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిరుపయోగంగా మారాయి

Published : 04 Jul 2024 05:26 IST

రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

ఆక్రమణకు గురవుతున్న మత్స్యశాఖ చెరువు  

తణుకు, న్యూస్‌టుడే: తణుకు పురపాలక సంఘ పరిధిలో మత్స్యశాఖ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిరుపయోగంగా మారాయి. స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని ఆనుకొని 3.74 ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు ఉన్నాయి. పట్టణ నడిబొడ్డున వీటి విలువ సుమారు రూ.53 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే అక్రమార్కులు అర ఎకరానికి పైగా ఆక్రమించి, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.  
తూడుతో నిరుపయోగంగా.. తణుకు పురపాలక సంఘంగా ఏర్పడక ముందు పంచాయతీగా ఉన్నసమయంలో చెరువుల నిర్వహణ బాధ్యత మత్స్య శాఖకు అప్పగించారు. రొయ్య, చేప పిల్లలను ఉత్పత్తి చేసి రాయితీపై పరిసర ప్రాంతాల్లోని 70 గ్రామాల  రైతులకు సరఫరా చేసేవారు. కాలక్రమేణా మత్స్య శాఖ నిర్వహణ పట్టించుకోకపోవడంతో చెరువు చుట్టూ ఆక్రమణలు వెలిశాయి. రెండేళ్ల కిందట సంబంధిత అధికారులను చెరువులను మళ్లీ తవ్వించి ఒక ఏడాది పాటు చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. అనంతరం నిరుపయోగంగా వదిలేేశారు. ప్రస్తుతం ఇవి గుర్రపు డెక్క, తూడుతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

  •  చెరువు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని శాశ్వత కట్టడాలు నిర్మించారు. ఈ భవనాల్లో వృథా జలాలను సైతం మత్స్యశాఖ చెరువులోకి విడుదల చేస్తుండటం గమనార్హం. సంతమార్కెట్‌ ఆనుకొని చెరువులు ఉండటంతో చెత్తకుప్పల్లా మారుతున్నాయి. దుర్గంధం వెదజల్లుతోంది.   

మత్స్యశాఖ పరిధిలో ఉన్న రెండు చెరువులను ఆధునికీకరించి రూ.25 లక్షలతో శాఖ భవనాన్ని నిర్మించడానికి ప్రతిపాదించాం. సిమెంట్‌ ట్యాంకుల్లో చేప పిల్లలను పెంచి ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మత్స్య శాఖకు సంబంధించి 3.74 ఎకరాల భూమిలో 1.74 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ప్రస్తుతం ఉన్న రెండెకరాలు ఆక్రమణకు గురికాకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేశాం.’ అని తణుకు మత్స్య శాఖ ఇన్‌ఛార్జి సహాయ ఇన్‌స్పెక్టర్‌ శివరామకృష్ణ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని