logo

రీసర్వే చిక్కు.. దక్కని భూహక్కు!

వైకాపా ప్రభుత్వం వచ్చాక చేపట్టిన రీసర్వే ద్వారా అంతకాదు ఇంతకాదన్న పాలకులు చివరికి చేతులెత్తేసి రైతులను అష్టకష్టాల పాల్జేశారు. మొదట్లో స్థానిక గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిపేస్తామని గొప్పలు చెప్పి చతికిలపడ్డారు

Updated : 04 Jul 2024 06:27 IST

రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి రైతుల గగ్గోలు

పెట్టుబడి సొమ్ములందక తీవ్ర ఆవేదన

పాలకొల్లు, నరసాపురం గ్రామీణ, పెంటపాడు, ఆకివీడు, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం వచ్చాక చేపట్టిన రీసర్వే ద్వారా అంతకాదు ఇంతకాదన్న పాలకులు చివరికి చేతులెత్తేసి రైతులను అష్టకష్టాల పాల్జేశారు. మొదట్లో స్థానిక గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిపేస్తామని గొప్పలు చెప్పి చతికిలపడ్డారు. గ్రామ సచివాలయాలు కాదు కదా రిజిస్ట్రారు కార్యాలయాల్లో సైతం నేడు రిజిస్ట్రేషన్లు జరగకుండా చేసిన ఘనతను మూటగట్టుకున్నారు. జిల్లాలోని ఏ మండలంలోనూ నూరుశాతం రీసర్వే చేసిన పరిస్థితికి చేరలేకపోయారు. ఎక్కువగా అంటే మండలానికి వచ్చి నాలుగైదు గ్రామాల్లో మాత్రమే సర్వే చేసి ముగించడంతో కొన్ని గ్రామాల రైతులైనా ఈ సమస్యల నుంచి బయటపడ్డారు.

  • యలమంచిలి మండలం బూరుగుపల్లికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు బోనం నానికి 1.30 సెంట్ల కొబ్బరితోట ఉంది. రీసర్వే చేసి బలంగా పునాది రాళ్లు వేస్తామని వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఆయన తోటను సర్వేచేసి రాళ్లు పాతేశారు. తీరాచూస్తే మొత్తం భూమిలో 5.50 సెంట్లు మాయం చేశారు. ఇదెక్కడి దారుణమని గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం కరవు. దీనిపై అప్పటి కలెక్టర్‌ ప్రశాంతికి స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నాని వాపోయారు. పాత దస్తావేజు ప్రకారం భూమిని కొలిచి ఇవ్వాలంటే కుదరదని.. పోనీ తన మొత్తం భూమిని చూపించాలంటే తమవల్ల కాదని రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసిందని నాని ఆవేదన చెందారు.్చ
  • అజ్జమూరు గ్రామానికి చెందిన తోట బాబురావుకు ఉన్న 1.13 ఎకరాల భూమిలో రీసర్వే అనంతరం మూడు సెంట్లు తగ్గిపోయింది. దీనికి నిరసనగా ఆయన పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదే మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన భూపతిరాజు తిమ్మరాజు కుటుంబ సభ్యులకు ఉన్న భూములకు సంబంధించిన వివరాలలోనూ గందరగోళం ఏర్పడటంతో గ్రామ సభలోనే సిద్దాపురం గ్రామస్థులు వ్యతిరేకించారు. వారంతా నెత్తీనోరు బాదుకున్నా గత ప్రభుత్వంలో అధికారులు వారిష్టానుసారం రీసర్వే చేసేశారని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో రీసర్వే జరిగిన తీరు రైతులు ఎదుర్కుంటున్న ఇక్కట్లకు అద్దంపట్టే ఇటువంటి ఉదాహరణలు వందల్లో ఉన్నాయంటే నమ్మక తప్పదు.

అదునొచ్చినా అందని సాయం..  తొలకరి మొదలైన తరుణంలో ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సమాయత్తమయ్యారు. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకులు, సహకార సంఘాల్లో రైతులు వారి ఆస్తులకు చెందిన పుస్తకాలను తనఖా పెడతారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లోని భూముల వివరాలు రీసర్వే పుణ్యమా అని ఆన్‌లైన్‌లో లేకపోవడం వారికి శాపంగా పరిణమించింది. ఏటా గ్రామాల్లోని వందలాది మందికి రుణాలిచ్చే సొసైటీలు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి నిర్ణయం తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

అంతా లోపభూయిష్టం.. పూర్వం నుంచి ఉన్న ఆర్‌.ఎస్‌.నంబర్లను తప్పించి కొత్తగా ఎల్‌.ఎస్‌.నంబర్లను అమల్లోకి తెచ్చి రీసర్వేలో అంటగట్టడం ఇబ్బందులకు ప్రధాన కారణంగా నిలిచింది. రెవెన్యూ రికార్డుల నుంచి రిజిస్ట్రార్‌ కార్యాలయాల వరకు ఆర్‌.ఎస్‌.నంబర్లు అందుబాటులో ఉంటే ఎటూ తేలని రీసర్వేలో ఎల్‌.ఎస్‌. నంబర్లు ఇచ్చి తద్వారా రైతులకు కావాల్సిన అన్ని పనులు అయ్యిపోవాలంటే ఎలాగని రెవెన్యూలో సీనియర్‌ డీటీ ఒకరు వాపోయారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే లోపభూయిష్టంగా ఉన్న రీసర్వే నిబంధనలు తనతోపాటు చాలామంది రెవెన్యూ అధికారులకు కూడా అర్థం కాలేదని ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. గ్రామాల్లోని రైతులకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వకుండా సర్వే ప్రక్రియ హడావిడిగా ఉరుకులు పరుగులతో ముగించేశారు. తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం అన్‌లైన్‌లో వెబ్‌ల్యాండ్‌లో పరిశీలించుకుంటూ పూర్వం నుంచి వస్తున్న రైతుల దస్తావేజులు, పాత రెవెన్యూ దస్త్రాలను పరిగణలోకి తీసుకోకుండా డ్రోన్‌ సర్వే కొనసాగించడం అన్ని ఇబ్బందులకు మూల కారణమైంది. 

  •  నరసాపురం మండలం సీతారామపురం సౌత్‌లో పెండ్ర శ్రీనుకు ఉన్న అరెకరం భూమిని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రయించారు. రిజిస్ట్రేషన్‌ నిమిత్తం వెళ్తే రీసర్వేలోని సాంకేతిక లోపాల వల్ల పనిపూర్తికాలేదు. కుటుంబ అవసరాలు తీరక నానా యాతన పడుతున్నట్లు శ్రీను దిగులు చెందుతున్నారు. 

ఎనిమిది నెలలుగా ఎన్నో ఇబ్బందులు..  పెంటపాడు మండలం దర్శిపర్రులో నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. గత వైకాపా ప్రభుత్వం చేపట్టిన పొలాల రీసర్వేలో ఆ నాలుగు ఎకరాల భూమి సర్వే నంబర్లు తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెం పరిధిలో కలిసిపోయాయి. అప్పట్నుంచి రెవెన్యూ అధికారులు హోల్డ్‌లో ఉంచారు. 1బి అడంగల్, పాస్‌ పుస్తకాలు కూడా ఇవ్వలేదు. భూమిని అమ్ముదామన్నా రిజిస్ట్రేషన్‌ కూడా అవ్వడం లేదు. ఇంట్లో త్వరలో శుభకార్యం జరగనుంది. చేతిలో చిల్లి గవ్వ లేదు. పొలాల రీసర్వేతో మా గ్రామంలోని 277 మంది రైతులు నా లాగే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలి.

 - రుద్రా గంగాదామోదరరావు. రైతు, దర్శిపర్రు, పెంటపాడు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని