logo

వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యలతో బడులు వెలవెల

ఇది యలమంచిలి మండల కేంద్రం శివారు గొలేపరచెరువు ప్రాథమిక పాఠశాల. గతంలో 15 మంది వరకు విద్యార్థులుండగా..ఈ ఏడాది ఒక్కరే మిగిలారు.

Published : 04 Jul 2024 05:20 IST

ఇది యలమంచిలి మండల కేంద్రం శివారు గొలేపరచెరువు ప్రాథమిక పాఠశాల. గతంలో 15 మంది వరకు విద్యార్థులుండగా..ఈ ఏడాది ఒక్కరే మిగిలారు. ఉన్న ఆ ఒక్క విద్యార్థికి పాఠాలు బోధిస్తూ ఏకైక ఉపాధ్యాయుడు కాలం వెళ్లదీస్తున్నారు. 

  • పెనుగొండ మండలం ఇలపర్రు పరిధిలోని ఆంబోతులదిబ్బలో గత ఏడాది ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఒక్కరంటే ఒక్కరే చేరడంతో సంఖ్య 8తో సరిపెట్టుకున్నారు.
  • ...ఇలా ఒకటో రెండో కాదు జిల్లాలో ఏ మండలం తీసుకున్నా పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో వెలవెలబోతున్నాయి. జిల్లాలో మొత్తం 1374 ప్రభుత్వ పాఠశాలలుండగా 71,383 మంది విద్యార్థులున్నారు.

ఆచంట, పాలకొల్లు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలకు ఇంతటి దుస్థితి పట్టడానికి గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. ఆయా నిర్ణయాలను విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతించలేక ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపడం శాపంగా పరిణమించింది. పాఠశాలల విలీనం దగ్గర ప్రారంభమైన ఆలోచన లేని నిర్ణయం ఒకటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో తరగతుల నిర్వహణ వరకు తీవ్ర ప్రభావాన్ని చూపింది. నాణ్యత లేని విద్యా కానుకలు, అమ్మఒడిలో నిర్వహణ ఛార్జీల పేరిట కోతలు వంటివి విసుగు పుట్టించాయి. వాటి ఫలితమే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ప్రభుత్వ బడులకు రానీయకుండా చేశాయని చెప్పడంలో సందేహం లేదు. 

 

  • ఆచంట మండలం పెనుమంచిలి పరిధిలోని జార్జిపేట ప్రాథమిక పాఠశాలలో ముగ్గురే విద్యార్థులున్నారు. స్థానికంగా ఉండేవారి పిల్లలను ఇక్కడ చేర్చకపోవడంతో సంచార జీవులుగా వచ్చిన కుటుంబం నుంచి ముగ్గురు విద్యార్థులను బతిమలాడి పాఠశాలకు తీసుకొచ్చిన దుస్థితి ఉపాధ్యాయులది. వారు మరో ప్రాంతానికి వలసపోతే ఇక్కడ పాఠశాల మూతపడాల్సిందే. 

చేతులెత్తేసిన ఉపాధ్యాయులు.. బోధనేతర పనులతో వెట్టిచాకిరి చేయించడం వల్ల విసిగిపోయిన ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయలేని పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యతిరేక నిర్ణయాలతో ఉపాధ్యాయులను తరచూ వేధించడం వల్ల వారు కూడా చేతులెత్తేసే పరిస్థితికి పాఠశాలలను తీసుకొచ్చారు. ఒక వైఫల్యానికి సవాలక్ష కారణాలు అన్నట్లు అన్నీ కూడి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే రోజులను తీసుకొచ్చాయి. దీనిపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ‘న్యూస్‌టుడే’ ఆరాదీయగా ఇంకా ప్రవేశాలు పూర్తిగానందున ఈ నెలాఖరుకు గాని ఏక విద్యార్థి లేక పదిలోపు విద్యార్థులున్న పాఠశాలల సంఖ్యపై స్పష్టత రాదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని