logo

నిర్మాణ రంగానికి ఊపిరొచ్చింది

కూటమి సర్కారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చ జెండా ఊపింది. తాజా నిర్ణయంతో గత అయిదేళ్లు వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడనుంది

Published : 04 Jul 2024 05:18 IST

 ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం పచ్చజెండా

 తెరుచుకోనున్న ర్యాంపులు

 లక్షలాది కుటుంబాల జీవనోపాధికి బాటలు

వైకాపా పాలనలో ఏలూరులో నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ, అనుబంధ సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు (పాతచిత్రం) 

ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే-కలిదిండి, ఆచంట: కూటమి సర్కారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చ జెండా ఊపింది. తాజా నిర్ణయంతో గత అయిదేళ్లు వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. జగన్‌ సర్కారులో మాదిరిగా ఇసుక అందని ద్రాక్షలా కాక అందరికీ అందుబాటులో ఉండనుంది. ఫలితంగా అయిదేళ్లుగా కుదేలైన నిర్మాణ రంగానికి తాజా నిర్ణయం ఊతమవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ఉచిత విధానంపై కసరత్తు.. జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో లోడింగ్, రవాణా ఖర్చుల వసూలు అంశాలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వైకాపా అమలు చేసిన ఇసుక విధానంతో నాయకులకు తప్ప ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు. రీచ్‌ల్లో ఇసుకను అడ్డగోలుగా దోచుకుని నాయకులు, అనుచరులు సొమ్ము చేసుకున్నారు. ఎన్నికల్లో వైకాపాను దెబ్బకొట్టిన అంశాల్లో ఇసుక విధానం ఒకటి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఇసుక విధానం అమలుకు కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆచీతూచీ నిర్ణయం తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. 

అధికారిక రీచ్‌లు ఇవే.. ఏలూరు జిల్లాలో కుక్కనూరు మండలం ఇబ్రహీంపేట, వింజరం, దాచారం, బూరుగువాయి, వేలేరుపాడు మండలం రుద్రంకోట పోలవరం మండలం గుటాల, పశ్చిమలో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి, దొడ్డిపట్ల, నరసాపురంలో అధికారిక ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో ఇసుక తవ్వకాలకు అనుకూలంగా మార్గం ఏర్పాటు చేయాల్సి ఉంది. సిద్ధాంతం రేవు దారి ఇప్పటికే దెబ్బతింది. నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లిలో అవకాశం ఉంది. ఇసుక పనులు చేయడానికి 150 వరకూ బంటాలు ఉన్నాయి. 4వేల మందికి పైగా కార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలు ఉపయోగించి కార్మికుల పొట్టకొట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

కార్మికలోకానికి ఊతం.. ఉమ్మడి జిల్లాలో వడ్రంగి, ఎలక్ట్రీషియన్, రాడ్‌ బెండింగ్, ప్లంబర్, పెయింటర్, తాపీ ఇలా అన్నీ కలిపి 62 కేటగిరీలకు చెందిన 1.50 లక్షల భవన నిర్మాణ కార్మికులున్నారు. వైకాపా అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారు.  కూటమి ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ రంగంతో పరోక్షంగా సంబంధం ఉన్న 3 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా తీసుకున్న ఉచిత ఇసుక నిర్ణయమూ ఈ కోవలేనిదే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని