logo

ఐక్యంగా పోరాడదాం ఆక్వాను రక్షిద్దాం!

వేల కోట్ల విదేశీ మారకం తెచ్చి పెడుతున్న ఆక్వా రంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో రైతులంతా ఐక్యంగా పనిచేసి సమస్యలను సాధించుకుందామని జైభారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అన్నారు.

Published : 04 Jul 2024 05:10 IST

రాష్ట్రస్థాయి మహాసభలో రైతుల తీర్మానం
వివిధ జిల్లాల నుంచి హాజరైన సాగుదారులు

మాట్లాడుతున్న గాంధీ

పాలకొల్లు, న్యూస్‌టుడే: వేల కోట్ల విదేశీ మారకం తెచ్చి పెడుతున్న ఆక్వా రంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో రైతులంతా ఐక్యంగా పనిచేసి సమస్యలను సాధించుకుందామని జైభారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అన్నారు. పాలకొల్లు - భీమవరం బైపాస్‌కు సమీపంలో ఉన్న ఎస్‌.ఎస్‌.ఎస్‌.కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మహాసభలో ఆయన మాట్లాడారు. సంఘ నాయకుడు బోనం చినబాబు మాట్లాడుతూ రైతులు కొనేవి ధరలు పెరిగి అమ్మేవి మాత్రం తగ్గుతున్న దుస్థితి ఆక్వా రంగంలోనే కొనసాగుతుందన్నారు. గడిచిన అయిదేళ్లలో మేత ధర కిలో రూ.95 పెరగగా రొయ్యల ధరలు మాత్రం అప్పటికంటే క్షీణించాయని పలువురు యువ రైతులు చెప్పారు. దళారులు, ఏజెంట్లు విపరీతంగా పెరిగిపోయి ఆక్వా రైతులను దోచుకుంటున్నందున వారిని కూడా సంఘంలోకి సభ్యులుగా చేర్చి న్యాయంగా పనిచేస్తేనే అమ్మకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రుద్రరాజు సత్యనారాయణరాజు సూచించారు. హేచరీల్లో రొయ్యపిల్లల నాణ్యత పెరిగేలా చూడాలని, ప్రోసెసింగ్‌ యూనిట్లు గొలుసుగా ఏర్పడి రైతులను దోచుకునే విధానాన్ని అరికట్టాలని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు.

 హాజరైన  సాగుదారులు

ఎకరాకు రూ.లక్షల్లో సీడ్‌ వేయకుండా సంఖ్యను తగ్గించి నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటే నష్టాలను ఎవరికివారే అరికట్టవచ్చని కొందరు రైతులు సభలో సూచించారు. రైతులంతా చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఒక తీర్మానాన్ని సంఘం తయారు చేసింది. తీర్మానం ప్రకారం రొయ్యల చెరువుల్లో సగటున ఒక సంఖ్య ప్రకారం ఎకరాకు రొయ్యలు పెంచేలా పద్ధతిని ఆచరించడం, హేచరీల్లో ఎంపెడా తనిఖీలు చేసి నాణ్యత లేకపోతే చర్యలు చేపట్టేలా చూడటం వంటి విషయాలను ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు ద్వారా ఆక్వా మంత్రికి, సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్తామని సంఘం తెలిపింది. అవసరమైతే 3 నుంచి 4 నెలలు పంట విరామం ప్రకటించేలా సంఘం నిర్ణయం తీసుకున్నా రైతులంతా కట్టుబడి విరామానికి సమ్మతించాలని పేర్కొన్నారు. దీనికి రైతులంతా మద్దతు పలికారు. రైతు నాయకులు సజ్జా బుజ్జి, కోడి విజయభాస్కర్, గౌరునాయుడు పాల్గొన్నారు.

రవాణా పన్ను తగ్గించాల్సి ఉంది.. 

మొదట్లో రొయ్యమేతల కట్టపై ఉన్న ధరకు 5 శాతం ట్రాన్‌పోర్టు ఛార్జీ విధించేవారు. తర్వాత దానికి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 2023లో ఆ ఛార్జీని 8 శాతానికి తగ్గించింది. కాని పరిశ్రమలు మాత్రం నేటికీ 15 శాతాన్నే వసూలు చేయడం దారుణం. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలి. 
- సుబ్బరాజు, ఆక్వా రైతు, భీమవరం


పరిశ్రమను ప్రక్షాళన చేయాలి

చెరువులకు రొయ్య పిల్లనందించే ఇన్‌లాండ్‌ హేచరీలను సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేయాలి. ఆక్వా పరిశ్రమను ప్రక్షాళన చేయాలి. రాష్ట్రంలో 64 వేల విద్యుత్తు కనెక్షన్లు ఉంటే వైకాపా వాటిని 54 వేలకు తగ్గించేసింది. విద్యుత్తు ధరలు పెంచేసింది. పరివర్తకాలు ఏర్పాటు చేసుకుంటే రాయితీలను తెగ్గోసింది. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం గాడిలో పెడితేనే రైతు నిలదొక్కుకుంటాడు. 
- నాగభూషణం, అమలాపురం, కోనసీమ జిల్లా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని