logo

నిధులు మళ్లించడంతో పనులు చేయలేకపోయాం!

వైకాపా పాలనలో 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులు పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు

Published : 04 Jul 2024 04:58 IST

రాష్ట్ర ఆర్థిక సంఘం కమిషన్‌ సమావేశంలో సర్పంచుల ఆందోళన

మాట్లాడుతున్న కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రత్నకుమారి 
ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే : వైకాపా పాలనలో 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులు పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల ఆర్థిక వనరులపై రాష్ట్ర ఆర్థిక సంఘం కమిషన్‌ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సర్పంచులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. పలువురు సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో సీనరేజీ, రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా వచ్చే సర్‌ఛార్జ్‌ సొమ్ములు, ఇతర సెస్‌లు సంబంధించి కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటిని కూడా ఇవ్వలేదని కమిషన్‌ ఛైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర అయిదో ఆర్థిక సంఘం కమిషన్‌  ఛైౖర్‌పర్సన్‌ రత్నకుమారి మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీల పరిస్థితులను, సర్పంచుల అభిప్రాయాలను, నిధుల విషయంలో.. జరిగిన అన్యాయం తదితర విషయాలపై ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని తెలిపారు. అనంతరం డీపీవో తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ పట్టిసీమ, బలివే, ద్వారకాతిరుమల వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పంచాయతీల్లో ఏటా ఉత్సవాలకు సంబంధించి సౌకర్యాల కల్పనకు పంచాయతీల నిధులే వెచ్చించాల్సి వస్తోందని తద్వారా ఆ పంచాయతీలకు మరింత భారం అవుతోందన్నారు. దేవాదాయశాఖ అధికారులు కొంత నిధులు ఆ పంచాయతీలకు అందిస్తే కొంత వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు ప్రసాదరావు, పద్మారావు, కృపారావు, జడ్పీ సీఈవో కె.సుబ్బారావు, డీఎల్‌పీవోలు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని