logo

వేలేరుపాడుకు జ్వరమొచ్చింది

విలీన మండలం వేలేరుపాడు విష జ్వరాలతో అల్లాడుతోంది. కొయిదా, వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాల్లో మూలుగుతున్నారు.

Published : 04 Jul 2024 04:38 IST

ఇంటికి ఇద్దరు ముగ్గురు బాధితులు

పడమరమెట్టలో తాగునీటి ట్యాంకు వద్ద అపరిశుభ్ర వాతావరణం   
వేలేరుపాడు, న్యూస్‌టుడే: విలీన మండలం వేలేరుపాడు విష జ్వరాలతో అల్లాడుతోంది. కొయిదా, వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాల్లో మూలుగుతున్నారు. పలువురు మలేరియా, టైఫాయిడ్, కీళ్లు, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై గ్రామీణ వైద్యుల వద్ద చికిత్సలు తీసుకుంటున్నారు.  

ఇక్కడ తీవ్రంగా.. కొయిదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పడమరమెట్టలో ఒకే కుటుంబానికి చెందిన నూపా నర్సమ్మ, అంజిబాబు, రఘుతో పాటు పూరెం సుబ్బలక్ష్మి, పీచడి హరికృష్ణ, సత్తిబాబు, సోడే జోగారావు, సింధు, పీసడి నాగమణి, నిరోషా, నూపా కిరణ్, రాజు, భాస్కర్‌రావు, చిన్నక్క, సరియం రాంబాబు, సరియం శేఖర్, తులసి, సాత్విక, అదే గ్రామంలోని మరో 20 మందికి పైగా ఒళ్లంతా దురదలు, కీళ్ల నొప్పులు, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరితో పాటు అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల తూర్పుమెట్ట, నార్లవరం, నార్లవరం కాలనీ, కాకిస్‌నూరు, టేకుపల్లి, పేరంటాలపల్లి, సిద్ధారం, కుంకుడుకొయ్యలపాకలు, టేకూరు, భూరెడ్డిగూడెం, చిట్టెంరెడ్డిపాడుతో పాటు వేలేరుపాడు ఆరోగ్య కేంద్రానికి ఆనుకుని ఉన్న రుద్రంకోట, రేపాకగొమ్ము, పాతపూచిరాల, మద్దిగట్ల గ్రామాల్లో పదుల సంఖ్యలో దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, మలేరియా, టైఫాయిడ్‌ లక్షణాలతో బాధపడుతూ సరైన వైద్యం అందక ఇళ్లలో మగ్గుతున్నారు.

పారిశుద్ధ్య లోపమే కారణమా..!.. విష జ్వరాలు ప్రబలడానికి పారిశుద్ధ్య లోపమే కారణమంటున్నారు. తాగు నీటి ట్యాంకులు, డ్రెయిన్లు శుభ్రం చేయించలేదు. అలాగే నిల్వ నీటిని తొలగించిన దాఖలాలు లేవు. ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. తాగునీటి పైపుల లీకేజీని అరికట్టడంలో నిర్లక్ష్యం నెలకొంది. ఈ కారణంగా కలుషిత నీటిని తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ దోమల నివారణ  చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో కంటి మీద కునుకు ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. 
చర్యలు చేపట్టాం.. ‘టైఫాయిడ్, మలేరియా జ్వరాలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. వర్షాకాలం పూర్తయ్యే వరకు వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాము’అని కేఆర్‌పురం డిప్యూటీ డీఎంహెచ్‌వో సురేశ్‌కుమార్‌ తెలిపారు. 
వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆరుబయట బల్లపై నీరసించి కూర్చున్న ఈ ఇద్దరి పేర్లు శ్రావణి, తేజస్విని. కాకిస్‌నూరుకు చెందిన వారు శివకాశీపురం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిది, మూడో తరగతి చదువుతున్నారు. మలేరియా, టైఫాయిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు.  రెండ్రోజుల నుంచి పీహెచ్‌సీకి తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు. వీరితో పాటు అదే పాఠశాలలోని పలువురు విద్యార్థినులు దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. 
వేలేరుపాడు పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న ఇతడి పేరు సున్నం అర్జున్‌. పడమరమెట్టకు చెందిన అతడు నాలుగు రోజులుగా మలేరియా లక్షణాలతో బాధపడుతున్నాడు. సుమారు 8 కి.మీ దూరం నుంచి నిత్యం చికిత్స నిమిత్తం వేలేరుపాడు వస్తున్నారు. 
జ్వరంతో బాధపడుతూ మంచంలో మూలుగుతున్న ఈమె పేరు నూపా నర్సమ్మ. పడమరమెట్టకు చెందిన ఆమె ఐదు రోజుల కిందట టైఫాయిడ్‌ బారిన పడి స్థానిక  గ్రామీణ వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రూ.6 వేల వరకు ఖర్చు చేశారు. జ్వరం తగ్గకపోవడంతో నీరసించారు. పెద్దాసుపత్రికి వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఇంటి వద్దే ఉంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని