logo

అక్రమాలకు గొడుగు పట్టారు

ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా  వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు.

Updated : 03 Jul 2024 04:40 IST

రెవెన్యూ శాఖలో వైకాపా భక్తులు
అధికార పార్టీతో అంటకాగిన తహసీల్దార్లు
నేతల మాటలు నెత్తిన పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు
ఈనాడు, భీమవరం

ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా  వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. జగనన్న కాలనీల్లో స్థల సేకరణ, మెరక పనుల నుంచి రెవెన్యూ రికార్డుల్లో మాయాజాలాల వరకు అన్ని రకాల అక్రమాలు యథేచ్ఛగా చేశారు. తెదేపా కార్యకర్తలను పలు విధాలా వేధించిన ఘనులున్నారు.

వైకాపాకు వినయ విధేయుడు.. ఇటీవల వరకు ముదినేపల్లి తహసీల్దార్‌గా పని చేసిన అధికారి వైకాపాకు వినయ విధేయుడిగా ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలే పరమావధిగా పని చేశారు. పాలసేకరణ కేంద్రాల ఎన్నికల్లో తెదేపా మద్దతుదారు విజయం సాధించారు. ప్రజాప్రతినిధి కుమారుడి ఆదేశాలతో తెదేపా నాయకుడి వాటర్‌ ప్లాంటును అడ్డగోలుగా ధ్వంసం చేయించారు. శ్రీహరిపురంలో రహదారికి ఇరువైపులా నిర్మాణాలున్నా ఒక్క తెదేపా కార్యకర్త రేకుల షెడ్డునే ధ్వంసం చేయించారు. జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో నేతలు చెప్పిన వారికే స్థలాలిచ్చారు. తెదేపా ముద్ర ఉంటే చాలు అర్హత ఉన్నా కొర్రీలు పెట్టి తప్పించారన్న విమర్శలున్నాయి.
మట్టిని మింగేశారు.. జంగారెడ్డిగూడెం తహసీల్దారు వైకాపాకు అపరభక్తుడు. అధికార పార్టీ నేతల అండతో ఎర్రకాలువకు గర్భశోకం మిగిల్చారు. స్థానిక ప్రజాప్రతినిధి తమ్ముడు ఆధ్వర్యంలో మట్టిమాఫియా సిండికేట్‌ ఏర్పాటు చేశారు. రోజుకు 150-200 లారీల మట్టి, గ్రావెల్‌ తరలించుకుపోతున్నా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో ఆయనకు భాగం ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో వైకాపా నేతల నుంచి నెలకు రూ.50 వేల ముడుపులు ఆయనకు ఖాతాకు వెళ్లేవి. రికార్డుల్లో లేని 28 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేసి రూ.30 లక్షలు తీసుకున్నారు. రీ సర్వేలో జరిగిన తప్పులను ఆసరాగా తీసుకుని వాటిని సరి చేసేందుకు భారీగా వసూళ్ల దందా చేశారు.

అంతా కృష్ణార్పణం.. ఎన్నికల ముందు వరకు ఉండి తహసీల్దార్‌గా పని చేసిన మహిళా అధికారి వైకాపా అంటే చెవి కోసుకుంటారు. జగనన్న ఇళ్ల స్థలాల భూసేకరణలో అప్పటి మంత్రి చెప్పిందే వేదంగా అమలు చేశారు. చాలా చోట్ల రూ.30 లక్షలు కూడా లేని స్థలాలను రూ.45 లక్షలకు కొనుగోలు చేయించారు. ఎన్‌ఆర్పీ అగ్రహారంలోని ప్రభుత్వ స్థలాన్ని పేదల ఇళ్ల పట్టాలకు కేటాయించాలని గ్రామస్థులు మొత్తుకున్నా వినలేదు. వైకాపా నాయకుల ఆదేశాలతో 72 సెంట్ల స్థలాన్ని వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించారు. పేదలకు మాత్రం అయిదు కిమీ దూరంలో ఎందుకూ పనికి రాని స్థలాలు కేటాయించారు. గ్రామంలో భూమి ఉన్నా కేటాయించకుండా కలిగొట్ల గ్రామస్థులకు 2 కిమీ దూరంలో ఆక్వా చెరువుల మధ్య ఇచ్చారు. మండలంలో సమస్యలపై తెదేపా ఎమ్మెల్యే ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకున్న దిక్కులేదు.

వారి మాటకు తలాడించడమే.. మొగల్తూరులో కొంతకాలం క్రితం వరకు పని చేసిన ఓ మహిళా తహసీల్దార్‌ వైకాపాకు భక్తురాలు. అధికార పార్టీ నేత చెప్పారని మండలంలోని 200 ఎకరాలకు పైగా అసైన్డ్‌ భూములను కొనుగోలుదారుల పేరు మీద మ్యుటేషన్‌ చేసేశారు. ఎకరానికి రూ.20వేల పైగా కమీషన్‌ తీసుకున్నారు. తెదేపా, జనసేన మద్దతుదారుల ఆర్థిక మూలాలు దెబ్బతీసి వారి పొట్టకొట్టాలన్న వైకాపా నాయకుల ఆలోచనను అమలు చేశారు. పేరుపాలెం తీరంలో ఎన్నో దుకాణాలున్నా..తెదేపా, జనసేనకు చెందిన మద్దతుదారుల దుకాణాలను అడ్డగోలుగా ధ్వంసం చేయించి వారిని రోడ్డుకీడ్చారు.

ఆ నేత మాటే వేదం.. నూజివీడు తహసీల్దారుగా పని చేసిన అధికారి వైకాపా నాయకుల మాటే శాసనం అన్నట్లు పని చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకుని వైకాపా నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి ఈ అధికారి పూర్తి సహకారం అందించారు. పాతరావిచర్ల పరిధిలోని కొండలను దాదాపు 20 ఎకరాలు.. వైకాపా నాయకులు చదును చేస్తే వాటికి డీ పట్టా ఇచ్చేశారు. ఇలా స్థలాలు పొందిన వారంతా వైకాపా అనుచరులే. ఈ వ్యవహారం చక్కబెట్టినందుకు ఎకరానికి రూ.20 వేల చొప్పున వసూలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని