logo

నేడు ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల : నిమ్మల

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 03 Jul 2024 03:44 IST

జలవనరులశాఖ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి రామానాయుడు

పాలకొల్లు, పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును మంగళవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో నిపుణుల సమావేశంలో కొద్ది సేపు పాల్గొన్నారు. అనంతరం స్పిల్‌వే, ఫిష్‌ల్యాడర్, ఎగువ కాఫర్‌డ్యాంల వద్ద నీటి పరిస్థితిని పరిశీలించారు. పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదలపై ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సీఈ కె.నరసింహమూర్తిలతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణాడెల్టాకు సాగు, తాగునీరు సమస్య తలెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని పంపులను బుధవారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి తాడిపూడి, పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పంపులను ప్రారంభిస్తామన్నారు. 

నిబద్ధతకు పింఛన్ల పంపిణీయే నిదర్శనం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు పెంచిన పింఛన్లను ఒకేసారి పంపిణీ చేయడమే నిదర్శనమని మంత్రి  రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కేవలం 8 గంటల్లోనే 95 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. 30వ తేదీ ఆదివారం వస్తే 29కే సచివాలయాల ఖాతాలకు సొమ్ము  జమ చేసి 1వ తేదీ తెల్లారుజాము నుంచే పింఛన్లు అందించడం కనీవినీ ఎరుగని ఘట్టమని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని