logo

కరెంటు కష్టాలు రానివ్వం

ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం.

Published : 03 Jul 2024 03:43 IST

నాణ్యమైన సరఫరా లక్ష్యం
సమస్యలుంటే 1912కు తెలియజేయండి  
విద్యుత్తు ఎస్‌ఈ సాల్మన్‌ రాజు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ముందస్తు ఏర్పాట్లు చేశాం. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు   అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి సమస్య  తలెత్తినా 1912 టోల్‌ఫ్రీ  నంబరుకు ఫోన్‌ చేస్తే తక్షణం స్పందిస్తాం అని విద్యుత్తు జిల్లా ఎస్‌ఈ పి.సాల్మన్‌ రాజు తెలిపారు. మంగళవారం ఆయన ‘న్యూస్‌టుడే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..

ప్రశ్న: జిల్లాలోని పలు ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు?
ఎస్‌ఈ :
సాధారణంగా వేసవిలో లోవోల్టేజీ సమస్య ఉంటుంది. ఎండల తీవ్రతను బట్టి విద్యుత్తు వినియోగం పెరుగుతుంది. ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో కెపాసిటీకి మించి  వినియోగం ఉంటే లోవోల్టేజీ సమస్య తలెత్తుతుంది. వర్షాకాలంలోనూ ఎక్కడైనా సమస్య వచ్చిందంటే అక్కడి ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతిందని అర్థం. ఇప్పుడు కూడా సమస్య ఉంటే ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం.

ట్రాన్స్‌ఫార్మర్లు చోరీలకు గురవుతున్నాయి. దీనివల్ల సరఫరాలో ఇబ్బంది ఉంటుంది కదా.. ఎలా అధిగమిస్తున్నారు?
ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైన ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా వెంటనే కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం 66 చోరీకి గురయ్యాయి. కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.6 కోట్లు ఖర్చు పెట్టాం.

వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రకృతివైపరీత్యాలతో సరఫరాలో ఇబ్బంది, లైన్లు దెబ్బతినడం జరుగుతుంది కదా. ముందస్తు ఏర్పాట్లు చేశారా?
వరదలు, తుపాన్ల కారణంగా స్తంభాలు పడిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం  జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది లేకుండా విద్యుత్తు పునరుద్ధరణకు ముందస్తుగా ఏర్పాట్లు చేశాం. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం.. తీరంలోని నరసాపురం, పాలకొల్లు మండలాలకు స్తంభాలు, తీగలు, ఇతర సామగ్రిని తరలించాం. ఇబ్బంది తలెత్తినప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేపడతాం.

విద్యుదాఘాతాలకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం అందించడం లేదని ఆరోపణలున్నాయి?
విద్యుదాఘాతానికి గురై మృతి చెందితే రూ.5 లక్షలు, పశువులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇస్తున్నాం. ఘటన జరిగాక బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు సమర్పిస్తే ఒకట్రెండు నెలల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమవుతుంది. ఆలస్యం అనేది అవాస్తవం. గత సంవత్సర కాలంలో 26 మందికి గాను 22 మందికి నష్టపరిహారం అందింది.

విద్యుదాఘాతాలకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం అందించడం లేదని ఆరోపణలున్నాయి?ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా విద్యుత్తు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారా?
వ్యవసాయ వినియోగానికి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్తు అందిస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఎక్కడైనా లైన్లు మరమ్మతులకు గురైతే వెంటనే పునరుద్ధరిస్తాం.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్తు ప్రమాదాలు పెరిగాయి. ఇటీవల జిల్లాలో పలువురు మృతి చెందారు. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. వీటిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు?
విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా సబ్‌స్టేషన్ల పరిధిలో సిబ్బంది రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పొలాలకు వెళ్లేటప్పుడు విద్యుత్తు తీగలు తెగిపడ్డాయేమో చూసుకోవాలి. తడి చేతులతో మోటార్లు వేయకూడదు. స్విచ్‌ బోర్డులు తాకకూడదు. గ్లౌజులు పెట్టుకొని, ఎండిన కర్రలతో స్విచ్‌లు వేయాలి. డాబాలపై దుస్తులు ఆరేసేటప్పుడు విద్యుత్తు తీగలు దగ్గరగా ఉన్నచోట జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నింటిపై అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని