logo

నమ్మకంగా ముంచేస్తున్నారు!

ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్‌ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు.

Published : 03 Jul 2024 03:39 IST

నకిలీ, నిషేధిత పురుగు మందుల విక్రయాలు
ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే

వేలేరుపాడు: పురుగు మందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న విజిలెన్సు అధికారులు

ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్‌ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

మూడు నెలల కిందట వేలేరుపాడు మండలం వసంతవాడలో ఓ ట్రేడర్స్‌కు చెందిన పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్సు అధికారులు తనిఖీ చేశారు. అక్కడ ప్రభుత్వం  నిషేధించిన గ్లైఫోసేట్‌ (గడ్డి మందు) పురుగు మందు విక్రయిస్తున్నట్లు.. స్టాక్‌కు, రిజిస్టర్లో ఉన్న లెక్కలకు  వ్యత్యాసమున్నట్లు గుర్తించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

నకిలీ, నిషేధిత, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించి దుకాణదారులు రైతులను ముంచేస్తున్నారు. అదునుకు పురుగు మందు వేస్తే పంటకు ఢోకా ఉండదని, చక్కగా చేతికి వస్తుందని నమ్మకంగా ఏమారుస్తున్నారు. వాటిని వాడిన కర్షకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 

రైతులకు నష్టం జరగకూడదని, నకిలీ, నిషేధిత పురుగు మందులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు విజిలెన్సు అధికారులు నడుం బిగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పురుగు మందుల దుకాణాలపై కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్‌ గడ్డి మందు ఎక్కువగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. చేపల చెరువుల్లో నీరు తీశాక శుద్ధి చేసేందుకు, చెలకలు, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల నివారణకు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గిరాకీ ఉండటంతో దుకాణ దారులు దొంగచాటుగా విక్రయిస్తున్నారు. అలాగే  నాసిరకం, కాలం చెల్లిన పురుగు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నిబంధనలు మీరితే చర్యలు తప్పవు.. దుకాణదారులు నిబంధనలు మీరితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్‌ చేస్తాం. నాణ్యమైన పురుగు మందులనే విక్రయించాలి. నాసిరకం, నిషేధిత మందులు అమ్మి రైతులను నష్టపరిస్తే సహించేది లేదు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నాం.

కరణం కుమార్, విజిలెన్స్‌ ఎస్పీ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని