logo

దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?

నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్‌ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్‌ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్‌ ఆలయం నిర్మించారు.

Published : 03 Jul 2024 03:33 IST

భారీ చోరీపై నమోదు కాని కేసు

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్‌ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్‌ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్‌ ఆలయం నిర్మించారు. ఆ ఆలయ ప్రారంభ హడావుడిలో ఉన్న వ్యాపారి నరసాపురంలో వ్యాపారుల ఆర్డర్ల మేరకు సింగ్‌ యువకుడికి ఆభరణాలు ఇచ్చి పంపించారు. ఆభరణాలను ఆయా దుకాణాలకు సరఫరా చేశారు. అనంతరం వ్యాపారుల వద్ద నూతన ఆర్డర్లు తీసుకుని వాటికి సంబంధించి సుమారు అర కిలో బంగారం తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి ఈ ప్రాంత బంగారు వ్యాపారులు సుమారు రూ.7 లక్షలు విరాళం అందించారు. దానితోపాటు వ్యాపారానికి సంబంధించి మరో రూ.4 లక్షలు వసూలు చేసి మొత్తం బంగారం, నగదు బ్యాగులో సర్దుకున్న దానితో భీమవరం వెళ్లే క్రమంలో బస్సులో ఆ బ్యాగు పోగొట్టుకున్నారు. గుంటూరుకు చెందిన యజమాని ఇక్కడికి రావాల్సి ఉంది. దీనిపై ఇంకా ఫిర్యాదు అందలేదని అందుకే కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

నిఘా కెమెరాలు కరవు.. ప్రతి వ్యాపార సంస్థలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. కార్గో కార్యాలయం వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉంది. దీంతో పట్టణంలోని ముఖ్యకూడళ్లు, ఇతర దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాల్సి ఉంది.

పోలీసుల తీరు విస్మయం.. చోరీ, నేరం జరిగిన సమయంలో పోలీసులు వేగంగా స్పందిస్తే ప్రయోజనం ఉంటుంది. నేరగాళ్లను వెంటనే పట్టుకుంటే అపహరణకు గురైన సొత్తు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అటువంటిది భారీ చోరీ జరిగినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో నేర తీవ్రత తక్కువగా ఉండేలా బాధితుల వద్ద నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని