logo

కూటమి సర్కారుపైనే ఆశలు!

వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Published : 03 Jul 2024 03:30 IST

నేడు పాలకొల్లులో ఆక్వా రైతుల మహాసభ
ఉండి, న్యూస్‌టుడే

వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రత్యేక అజెండాతో పాలకొల్లులో బుధవారం నిర్వహించనున్న మహాసభకు ఆక్వా సాగుదారులంతా తరలిరావాలని కోరుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రొయ్యలు, చేపల చెరువులు విస్తరించిన ప్రాంతాల్లో దీనిపై గత కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి.

కీలక రంగం

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.40 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించింది. ఏటా రూ.18 వేల కోట్ల టర్నోవర్‌ జరిగే ఈ రంగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కరోనా వ్యాప్తి కాలం, ఆ తరువాత వైకాపా సర్కారు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఈ రంగంపై ఆధారపడిన రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కిలో రొయ్యల (100 కౌంటు) ఉత్పత్తికి రూ.210 వరకు ఖర్చవుతోందని సాగుదారులు చెబుతున్నారు. మార్కెట్లో కనీసం నాలుగు టన్నులకు మించి రొయ్యలు విక్రయించిన రైతుకు ప్రస్తుతం కిలోకు ఇచ్చే ధర రూ.205 మాత్రమే. పరిస్థితులన్నీ అనుకూలించిన సందర్భాల్లోనూ పెట్టుబడులు రావడం లేదని సాగుదారులు వాపోతున్నారు.

తగ్గిన సాగు విస్తీర్ణం

జోన్లు, విద్యుత్తు రాయితీలో కోత, ఫీడ్, రసాయనాలు, విద్యుత్తు పరివర్తకాల ధరలు పెరిగిపోవడంతో ఈ రంగాన్ని గట్టి దెబ్బతీశాయి. సమస్యపై మూడేళ్ల నుంచి రైతులు పోరుబాట పట్టినా వైకాపా సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో వేలాది మంది సాగుకు దూరమయ్యారు. 2021 ముందు పశ్చిమలో 1.52 లక్షల ఎకరాల్లో విస్తరించిన రొయ్యల చెరువులు నేడు 90 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. సాగుదారుల సంఖ్య    1.05 లక్షల నుంచి 75 వేలకు తగ్గింది.

ఎజెండా ఇదీ..

పాలకొల్లులో బుధవారం నిర్వహించే మహా సభలో గత అయిదేళ్లలో ఆక్వా రంగం ఎదుర్కొన్న ఒడుదొడుకులకు కారణాలు, రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్, ఫీడ్‌లలో నాణ్యత ప్రమాణాలు, ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రాయితీలపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు.

నివేదిక అందిస్తాం

ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై పాలకొల్లు మహాసభలో చర్చించి తీర్మానాలను నూతన ప్రభుత్వానికి నివేదిస్తాం. సాగుదారులందరికీ విద్యుత్తు రాయితీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా, రొయ్యల ధరల స్థిరీకరణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

రుద్రరాజు యువరాజు, ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని